
మునిపల్లి, ఆగస్టు 14: పోలీస్‌స్టేషన్ అనగానే గంభీరమైన వాతావరణం, స్టేషన్ మెట్లు ఎక్కాలంటేనే జనం భయపడేవారు. ఇదంతా గతం, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ప్రోత్సహిస్తుడడంతో ఠాణాల రూపురేఖలు పూర్తిగా మారాయి. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరా పోలీస్‌స్టేషన్ నందనవనాన్ని తలపిస్తున్నది. స్టేషన్ పరిసరాలను చూస్తే ఠాణా అంటే ఎవరూ నమ్మరు. ఎందుకంటే పార్కును తలపించేలా ఇక్కడ మొక్కలు నాటి సంరక్షిస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించారు. ఎస్సై మహేశ్వర్‌రెడ్డి ప్రత్యేక కృషితో బుధేరా పోలీస్ స్టేషన్ నందనవనంలా మారింది. స్టేషన్ పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. హరితహారం కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మొక్కలు నాటి జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. పార్కును తలపించేలా ఠాణాను మొక్కలతో తీర్చిదిద్దారు. స్టేషన్‌కు వచ్చేవారు ఆహ్లాదకర వాతావరణాన్ని చూసి ముగ్ధులవుతున్నారు. హరితహారం కార్యక్రమానికి ముందు బుధేరా పోలీస్‌స్టేషన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండేవి. ఇప్పుడు ఆహ్లాదకరంగా మారింది. స్టేషన్ పోలీస్ సిబ్బంది ఆసక్తిని గమనించి సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ, కొండాపూర్ సీఐ లక్ష్మారెడ్డి, మునిపల్లి ఎస్సై మహేశ్వర్‌రెడ్డి బుధేరా ఠాణా సిబ్బందిని ప్రోత్సహించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలంలో మొక్కలు నాటడంతో ఆ ప్రాంతమంతా ప్రస్తుతం పచ్చదనంతో కళకళలాడుతున్నది.
బుధేరా పోలీస్ స్టేషన్లో నీటి సౌకర్యం అంతంత మాత్రమే. వేసవిలో మొక్కలు ఎండిపోకుండా బయట నుంచి నీరు తెచ్చి మొక్కలకు పోసి సంరక్షిస్తున్నారు. ప్రస్తుత ఎస్సై మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మరింత ఉత్సాహంతో మొక్కల సంరక్షణలో భాగమవుతున్నారు. నిత్యం మొక్కల సంరక్షణలో నిమగ్నమవుతున్నారు.
వేసవిలో అక్కడక్కడా మొక్కలు ఎండిపోగా తక్షణమే వాటి స్థానంలో తిరిగి మొక్కలు నాటించారు. హరితహారంలో భారీగా మొక్కలు నాటారు. సమీప గ్రామాల్లోని చెరువుల నుంచి నల్లమట్టిని తెప్పించి మొక్కల మొదళ్ల మధ్య వేసి సంరక్షిస్తున్నారు. దీంతో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి.
బుధేరా పోలీస్‌స్టేషన్ ఆవరణలో మరిన్ని మొక్కలు నాటుతాం. నాటిన మొక్కలను సంరక్షించేందుకు మాసిబ్బంది ఎంతో కృషిచేస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలకు మొక్కల పెంపకం ప్రాధాన్యతను తెలియజేస్తున్నాం. స్టేషన్ పరిసరాలను ఆహ్లాదకరంగా మార్చాం. ఉన్నతాధికారులు మాసిబ్బందిని, నన్ను పలుమార్లు అభినందించారు.