
జహీరాబాద్, సెప్టెంబర్ 4: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టరు ప్లాంట్‌లో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం(టీఆర్ఎస్కేవీ) రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ ఘన విజయం సాధించారు. శనివారం కార్మిక శాఖ అధికారులు మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టరు ప్లాంట్‌లో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు నిర్వహించారు. మహీంద్రా ట్రాక్టరు ప్లాంట్‌లో 411 మంది కార్మికులకు ఓటు హక్కు ఉంది. కార్మిక సంఘం ఎన్నికల్లో 409 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కేవీ 239, సీఐటీయూ 157, బీఎంఎస్‌కు 13 ఓట్లు వచ్చాయి. కార్మిక సంఘం ఎన్నికల్లో సీఐటీయూపై టీఆర్ఎస్కేవీ 82 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్కేవీ అభ్యర్థిగా టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, సీఐటీయూ నుంచి చుక్కారాములు, బీఎంఎస్ నుంచి ప్రదీప్‌కుమార్ పోటీచేశారు. చుక్కా రాములుపై రాంబాబు యాదవ్ 82 ఓట్లతో ఆధిక్యంతో విజయం సాధించడంతో కార్మికులు ఫ్యాక్టరీ ఎదుట సంబురాలు నిర్వహించుకున్నారు. టీఆర్ఎస్కేవీ విజయం కోసం రాంబాబు యాదవ్‌కు మద్దతుగా టీఎంఎస్ కార్మిక సంఘం నాయకులు, జహీరాబాద్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎంజీ రాములు ప్రచారం చేశారు.
మహీంద్రా ట్రాక్టరు ప్లాంట్‌లో మొదటిసారి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు కార్మిక శాఖ నిర్వహించింది. జహీరాబాద్ కార్మిక శాఖ అధికారి ప్రవీణ్‌కుమార్ కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 నుంచి 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. 4:30 గంటలకు ఓట్లు లెక్కించారు. జహీరాబాద్ పట్టణ సీఐ రాజశేఖర్, ఎస్సైలు శ్రీకాంత్, రవి, కాశీనాథ్ బందోబస్తు పర్యవేక్షించారు.
భారీ వర్షంలోనూ కార్మికుల సంబురాలు…
మహీంద్రా కార్మిక సంఘం ఎన్నికలో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ విజయం సాధించడంతో కార్మికులు, టీఆర్ఎస్ నాయకులు సంబురాలు నిర్వహించుకున్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎంజీ రాములు, కార్మిక సంఘం నాయకులు వర్షంలో సంబురాలు నిర్వహించుకున్నారు. కార్మికులు రాంబాబు యాదవ్, ఎంజీ రాములుకు పూలమాలలు వేసి సన్మానించారు. కార్యక్రమంలో కార్మికులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కారానికి కృషి : రాంబాబుయాదవ్
జహీరాబాద్ మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్లు ప్లాంట్‌లో కార్మికుల సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ తెలిపారు. కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించిన కార్మికులకు రుణపడి ఉంటానన్నారు. కార్మికులకు మెరుగైన వేతనంతో పాటు ఇతర సమస్యలు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ఓట్లు వేసి గెలిపించిన కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.