‘తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది.. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం.. వ్యవసాయం అభివృద్ధి చెందితే వర్తక, వాణిజ్య రంగాలూ ప్రగతి సాధిస్తాయి.. అన్నదాతలు ఒకచోట చేరి సాగుపై చర్చించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2601 రైతు వేదికలను నిర్మించాం.. వ్యవసాయ రంగానికి ఏడాదికి రూ. 60 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..’ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం షాద్‌నగర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవం, కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వలో రైతు వేదిక ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఈ వానకాలం సీజన్లో 60.84 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయమందిందన్నారు. కార్పొరేట్ శక్తులకు తొత్తుగా కేంద్ర వ్యవసాయ చట్టాలు ఉన్నాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు, బీమా వంటి పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తారా అని మండిపడ్డారు. విమర్శలకు హద్దు ఉండాలే.. దిగజారి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
రైతు రాజ్యంగా తెలంగాణ
వ్యవసాయరంగం బలోపేతంతోనే అభివృద్ధి సాధ్యం
పంట రాబడిపైనే దేశ సంపద ఆధారం
ఈ వాన కాలంలో 60.84 లక్షల మందికి రైతు బంధు
రూ.7,360 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ
కార్పొరేట్ శక్తులకు తొత్తుగా కేంద్ర వ్యవసాయ చట్టాలు
ఉద్యోగ కల్పనలో మాట తప్పిన బీజేపీ
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
షాద్‌నగర్, ఆగస్టు 11 : వ్యవసాయ రంగం బలోపేతంతోనే ఇతర రంగాల అభివృద్ధి ఆధారపడి ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరుగాలని, అప్పుడే వర్తక, వాణిజ్య రంగాలు ప్రగతి సాధిస్తాయని చెప్పారు. రైతు పండించే పంట రాబడిపైనే దేశ సంపద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. బుధవారం షాద్‌నగర్ మార్కెట్ యార్డులో షాద్‌నగర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతు పండించిన ప్రతి పంట ప్రజల అవసరాలకే అనే విషయాన్ని గ్రహించిన సీఎం కేసీఆర్, రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఈ వాన కాలంలో 60.84 లక్షల మంది రైతులకు రూ.7,360 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలికేలా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణకు రావల్సిన వాటా ప్రకారమే సాగు నీరు, నియామకాలు అడుగుతున్నామని చెప్పారు. ఆంధ్రా ప్రాంత నాయకులు తెలంగాణలో పార్టీ పెట్టి ఇక్కడి సీఎంను విమర్శిస్తే ఎవ్వరూ ఊరుకోరని హెచ్చరించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ఉన్న ఉద్యోగాలను తొలగించారని పేర్కొన్నారు.
కేవలం మూడేండ్లలో 50 లక్షల ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని అభిప్రాయపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా సాగునీరు ఇద్దామంటే కాంగ్రెస్ నేతలు 88 కేసులు వేశారని దుయ్యబట్టారు. ఎవరెన్ని అటంకాలు సృషించినా పాలమూరు ఎత్తిపోతల ద్వారా షాద్‌నగర్ ప్రాంతానికి సాగు నీరు అందితీరుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. మార్కెట్ అభివృద్ధి, రైతుల శ్రేయస్సు కోసం పాలక సభ్యులు కృషిచేయాలని కోరారు.
ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మల్సీలు దామోదర్‌రెడ్డి, సురభి వాణీదేవి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చొరవతో నేడు తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతుల జీవన విధానంలో పెనుమార్పులను తీసుకొచ్చారన్నారు. మార్కెట్ యార్డుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు రైతు బీమా నిధుల మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు.
షాద్‌నగర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మార్కెట్ శాఖ జిల్లా అధికారిణి ఛాయాదేవి చైర్మన్‌గా మన్నె కవిత నారాయణ, వైస్ చైర్మన్‌గా నారాయణరెడ్డితో పాటు మరో ఎనిమిది మంది డైరెక్టర్ల చేత పదవి స్వీకరణ ప్రమాణాన్ని చేయించారు. వీరిని మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ అభినందించారు.
మంత్రి, ఎమ్మెల్యే సమక్షంలో కొందుర్గు వైస్ ఎంపీపీ రాజేష్‌పటేల్ ఆధ్వర్యంలో పులుసుమామిడికి చెందిన షరీఫాబేగం, ఆమె అనుచరులు 80 మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి కండువాలను కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజాఇద్రీస్, నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులున్నారు.
కొత్తూరు/కొత్తూరు రూరల్, ఆగస్టు 11: తెలంగాణను రైతు రాజ్యంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వలో బుధవారం మంత్రి నిరంజన్‌రెడ్డి రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 4 కోట్ల మందికి ఉపాధి కల్పించాలంటే కేవలం వ్యవసాయ రంగం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా పంజాబ్ ఉండేదని.. నేడు ఆ స్థానాన్ని తెలంగాణ ఆక్రమించిందని తెలిపారు. రైతుకు కావాల్సిన అన్ని సౌకర్యాలకు రైతు వేదికలు ఒక వారధిలా పనిచేస్తాయని వివరించారు. రాష్ట్రంలో మొత్తం 2601 రైతు వేదికలను నిర్మించామని తెలిపారు. చాలా రైతు వేదికల్లో ఇప్పటికే రైతులకు శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించామని తెలిపారు. ఏడీలు, ఈవోలు, ఏఈవోలు రైతులను రైతు వేదికలకు రప్పించి వారికి ఉపయోగపడే సమాచారాన్ని శిక్షణ ద్వారా ఇస్తున్నారన్నారు. రైతు వేదికల ద్వారా చేసే మరో ముఖ్యమైన పని రైతులను సంఘటితపర్చడమన్నారు. ఒక రైతుగా కేసీఆర్ రైతుకు కావాల్సిన కరెంటు, నీళ్లు, పెట్టుబడి, బీమా, వ్యవసాయ అధికారులు, రైతు వేదికలు ఇలా అన్ని వసుతులు కల్పిస్తున్నారన్నారు. వ్యవసాయ రంగానికి ఒక ఏడాదికి రూ.60వేల కోట్లు ఖర్చుపెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన చనిపోయిన రైతు కుటుంబాలకు రైతు బీమా చెక్కులను మంత్రి నిరంజన్‌రెడ్డి ఈ సందర్భంగా అందజేశారు.
ఇంటింటికీ మిషన్ భగరథ ద్వారా సాగునీరు అందించినట్లుగానే ప్రతి గుంటకు సాగునీరు అందిస్తాం. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో అద్భుత పథకాలు ప్రవేశపెట్టారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా షాద్‌నగర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రైతులకు వ్యవసాయంలో అధిక లాభాలు ఆర్జించడానికే రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నాం.