
షాబాద్, సెప్టెంబర్ 4 : పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెల్లో వినూత్న మార్పులు వస్తున్నాయి. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. ప్రతి గ్రామంలో వైకుంఠధామం, కంపోస్ట్‌యార్డు, పల్లెప్రకృతి వనం, హరితహారం మొక్కలను నాటారు. గ్రామ నర్సరీల్లో సరిపడా మొక్కలు అందుబాటులో ఉంటున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో ఈ పనులన్నీ పూర్తై అందుబాటులోకి వచ్చాయి. మిషన్‌భగీరథతో ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ను ఏర్పాటు చేసి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. షాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో పల్లెప్రగతిలో చేపట్టిన పనులను పూర్తి చేశారు. హరితహారంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేయడంతో గ్రామం పరిశుభ్రంగా మారింది.
పూర్తయిన ప్రగతి పనులు…
షాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో 1500 మంది జనాభా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ. 1.36 లక్షల నిధులు వస్తున్నాయి. వాటితో పంచాయతీ ట్రాక్టర్ కిస్తులు, సిబ్బంది వేతనాలు, కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నారు. పల్లెప్రగతిలో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. రూ. 12లక్షలతో వైకుంఠధామం, రూ. 2.50లక్షలతో కంపోస్ట్ యార్డు, రూ. 1.50లక్షలతో పల్లె ప్రకృతి వనం, హరితహారం నర్సరీని ఏర్పాటు చేశారు. 30గుంటల ప్రభుత్వ భూమిలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి, అందులో వివిధ రకాల 1500 మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. అదే విధంగా హరితహారం నర్సరీలో 12వేల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. గ్రామంలోని ఆయా కాలనీల్లో, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి నిత్యం పంచాయతీ ట్యాంకర్‌తో నీటిని పోస్తున్నారు. పంచాయతీ ట్రాక్టర్‌తో ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించి కంపోస్ట్యార్డుకు తరలించి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు.
రూ. 10లక్షలతో అభివృద్ధి పనులు…
పోతుగల్ గ్రామంలో ఇప్పటి వరకు రూ. 10లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ. 5లక్షలతో సీసీ రోడ్డు పనులు, రూ. 5లక్షలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించారు. మిషన్ భగీరథతో గ్రామంలోని 283 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి, తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామంలో చేపడుతున్న పారిశుధ్య పనులతో స్వచ్ఛగ్రామంగా మారింది. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామ రూపురేఖలు మారడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం..
ప్రభుత్వ నిధులతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. పల్లెప్రగతితో గ్రామ రూపురేఖలు మారాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నాం. రూ. 10లక్షల నిధులతో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించాం.
ప్రగతి పనులు పూర్తి చేశాం..
గ్రామంలో పల్లెప్రగతిలో చేపట్టిన పనులన్నీ పూర్తి చేశాం. వైకుంఠధామం, కంపోస్ట్‌యార్డు అందుబాటులోకి వచ్చాయి. పల్లెప్రకృతివనంలో 1500 మొక్కలు పెంచుతున్నాం. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాం.