దేశ సరిహద్దుల్లో తుపాకులు ధరించి, రక్షణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన వారు.. ఇప్పుడు ప్రభుత్వ కొలువుల్లో చేరి ప్రజాసేవ చేస్తున్నారు. ఒకప్పుడు గన్ పట్టుకున్న ఆ చేతుల్లో ఇప్పుడు పెన్ను కనిపిస్తున్నది. యుక్తవయసులో ఆర్మీలో చేరినవారు.. 17ఏండ్లపాటు రక్షణవిభాగాల్లో ప్రాణాలకు తెగించి విధినిర్వహణ చేశారు. మిలిటరీ సర్వీసును పూర్తిచేసుకుని తిరిగివచ్చినా.. ఖాళీగా ఉండకుండా ప్రభుత్వ కొలువుకోసం ప్రయత్నించారు. పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికయ్యారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఐదుగురు మాజీ జవాన్లు పంచాయతీ సెక్రటరీలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ గ్రామ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు.
-బోధన్ రూరల్, ఆగస్టు 14: వారంతా మొన్నటి వరకు దేశసేవ చేశారు. ప్రస్తుతం ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. బార్డర్లో 17 ఏండ్ల పాటు సైనికుడిగా విధులు నిర్వహించి ప్రస్తుతం సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చారు. అనుకున్నదే తడవుగా గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పల్లెల్లో విధులు నిర్వహించడంతోపాటు తమ వంతు చేయూతనందిస్తున్నారు. సరిహద్దులో దేశానికి రక్షణగా పనిచేసిన జవాన్లు ఇప్పుడు ప్రజల మధ్యలో తిరుగుతూ తమవంతు సేవలందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఐదుగురు మాజీ జవాన్లు పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం ఎరాజ్‌పల్లి, ఎడపల్లి మండలం కుర్నాపల్లి, మోప్కాల్ మండలం కులాస్పూర్, రుద్రూర్ మండలం సిద్ధాపూర్, మాక్లూర్ మండలం బొంకన్పల్లి గ్రామాల్లో కొన్ని నెలల నుంచి భారత మాజీ సైనికులు పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్నారు. 17ఏండ్ల పాటు భారత సైన్యంలో పని చేసిన వీరంతా సమాజ శ్రేయస్సు కోసం ఈ వృత్తిని ఎంచుకున్నట్లు తెలిపారు. పుట్టిన ఊరితోపాటు సమాజ మార్పునకు బాటలు వేస్తున్నారు. తాము చదువుకున్న పాఠశాలలు, గ్రామాల్లో ప్రజా అవసరాలను తీర్చేందుకు తమవంతు సహకారాన్ని అందిస్తున్నారు. ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకుంటూ సత్వర పరిష్కారానికి పాటుపడుతున్నారు. పంచాయతీ కార్యాలయంలో పెండింగ్ పనులు లేకుండా కొనసాగిస్తున్నారు.
నేను ఆర్మీలో ఉన్నప్పుడు గన్‌తో సేవ చేశాను. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శిగా పెన్నుతో సేవలు అందిస్తున్నా. నావంతుగా మా ఊరి అభివృద్ధికి సహకారం అందిస్తున్నాను. ఉద్యోగాలపై, సమాజ సేవపై యువత, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తాను.
మాజీ సైనికులు ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులుగా పని చేస్తూ సొంతూరికి కొంత సాయాన్ని అందిస్తున్నారు. తాము చదువుకొని విద్యావంతులుగా మారి ఉన్నత స్థానాల్లో నిలిచేలా చేసిన సొంతూరి రుణాన్ని తీర్చుకుంటున్నారు. చదువుకున్న పాఠశాల అభివృద్ధికి డబ్బులను కేటాయిస్తూ, గ్రామంలో ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని ఐదుగురు పంచాయతీ కార్యదర్శులు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. భారత సైనికులుగా తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశసేవ చేసిన వారు ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహించడం స్ఫూర్తిదాయకం. అతి చిన్న వయస్సులోనే భారత సైన్య దళంలో ఉద్యోగాలు సాధించి దేశానికి రక్షకులుగా పని చేసిన జవాన్లు పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహించడం కొత్త ఒరవడిని చూపుతున్నది. ఈ దిశగా నేటి యువత అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంతోపాటు సమాజ సేవలో తరించే ఆస్కారం ఉంటుంది.
నేను 17ఏండ్లపాటు ఆర్మీలో జవాన్‌గా పని చేశాను. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఖాళీగా ఉండకుండా ప్రజలకు సేవలందించేందుకు పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాన్ని ఎంచుకున్నాను. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నాను. నిబంధనలు పాటిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నా.