బోధన్, ఆగస్టు 11: మార్కెట్లో పప్పుల ధరలు మండిపోతున్నాయి. పప్పుల్లో ఎక్కువగా వినియోగించే కంది పప్పు ధర రెండేండ్ల కిందటితో పోలిస్తే కిలోకు రూ.30 నుంచి 40 వరకు పెరిగింది. గత పాలకుల నిర్లక్ష్యపు విధానాల ఫలితంగా పప్పు ధాన్యాల సాగు నష్టదాయకంగా మారడంతో రైతులు వీటి సాగు నుంచి క్రమంగా తప్పుకున్నారు. ఒకప్పుడు జిల్లాలో ముఖ్యంగా బోధన్ డివిజన్ ప్రాంతంలో వరితోపాటు పప్పులను కూడా ఎంతో కొంత విస్తీర్ణంలో పండించేవారు. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని రైతులు తమకున్న కొద్దిపాటి భూముల్లో పప్పులు సాగుచేసి, తమ ఇంటి అవసరాల కోసం వాడుకునేవారు. దుకాణాల్లో కొనుక్కోవడమన్నది అప్పట్లో చాలా అరుదుగా కనిపించేది. ఇప్పుడా పరిస్థితి లేదు. దీంతో పప్పు ధాన్యాల సాగును రైతులకు లాభాదాయకంగా మలిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వానకాలం ప్రారంభంలో సీఎం కేసీఆర్ నిర్వహించిన వ్యవసాయశాఖ సమీక్షలో పప్పు ధాన్యాల సాగు అంశం ప్రాధాన్యతను సంతరించుకున్నది. వరికి ప్రత్యామ్నాయంగా పప్పు ధాన్యాల సాగును పెంచాలని, వీటి సాగుకు అవసరమైన ప్రోత్సాహంతోపాటు మార్కెట్ సౌకర్యం కూడా కల్పించాలని ఆ సమీక్షలో కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దీంతో వ్యవసాయశాఖ ఈ వానకాలంలో గతేడాదిలాగే పప్పు ధాన్యాల సాగుపై దృష్టి సారించింది. ముఖ్యంగా కంది పంటను రైతులు సాగుచేసేలా ప్రత్యేక డ్రైవ్‌ను నిజామాబాద్ జిల్లాలో నిర్వహించింది. రెండేండ్లుగా జరుగుతున్న ఈ ప్రయత్నాల ఫలితంగా ప్రస్తుత సీజన్లో కంది పంట వైపు రైతులు దృష్టిని సారించారు. ఫలితంగా జిల్లాలో కంది పంట విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
కంది, పెసర పంటల సాగును ప్రోత్సాహించేందుకు చిన్న రైతులకు వాటి విత్తనాలను జాతీయ పప్పు ధాన్యాల అభివృద్ధి పథకం కింద ఉచితంగా అందించారు. వ్యవసాయశాఖ చేసిన కృషి ఫలితంగా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి నా ణ్యమైన విత్తనాలు రైతులకు అందాయి. జిల్లాలో మొత్తం 1,653 మంది రైతులను ఎంపిక చేసి, వారికి రెండు కిట్ల చొప్పున విత్తనాలను అందజేశారు. ఒక్కో కిట్టులో నాలుగు కిలోల విత్తనం ఉంటుంది. ఈ ఉచిత విత్తనాల సరఫరాతో జిల్లాలోని సుమారు 1600 ఎకరాల్లో కొత్తగా కంది, పెసర సాగును ప్రోత్సహించారు.
గత వానకాలంలో రైతులు పండించిన పప్పు ధాన్యాన్ని కొనేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. మహారాష్ట్ర నుంచి వ్యాపారులు వచ్చి కందులను కొనుగోలు చేశారు. గతేడాది కందులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.6000 కాగా, బహిరంగ మార్కెట్లో వ్యాపారులు రూ.6,500 నుంచి రూ.7 వేల వరకు కొనుగోలు చేశారు. ఈసారి కందుల మద్దతు ధర రూ.6,300లకు పెరిగింది. గతేడాదిలాగే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నది. పప్పులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈసారి కూడా వ్యాపారులు కందులను పోటీపడి కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ప్రస్తుత సీజన్లో నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 6,208 ఎకరాల్లో రైతులు కంది పంటను వేశారు. పెసర, మినుము పంటల సాగు పెద్దగా పెరగనప్పటికీ, కంది సాగు విస్తీర్ణం పెరగడంతో పప్పు ధాన్యాల సాగులో కొత్త ఒరవడి ప్రారంభమైందని వ్యవసాయ అధికారులు అంటున్నారు. జిల్లాలో కంది పంట సాధారణ విస్తీర్ణం 3,027 ఎకరాలు కాగా, గతేడాది రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో 4,029 ఎకరాల్లో సాగుచేశారు. ఈ ఏడాది ఉచితంగా విత్తనాల కిట్లను ఇవ్వడం, కంది సాగుపై అవగాహన కల్పించడంతో అదనంగా మరో రెండు వేల ఎకరాల్లో కంది పంట సాగయ్యింది. ప్రస్తుతం జిల్లాలో సాగు చేసిన 6,208 ఎకరాల్లో ఒక్క బోధన్ ప్రాంతంలో 4,256 ఎకరాల్లో కంది పంటను వేయడం గమనార్హం. 31 ఎకరాల్లో పెసర, 565 ఎకరాల్లో మినుము సాగుచేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈసారి పప్పు ధాన్యాల సాగుపై క్లస్టర్ల వారీగా రైతులకు అవగాహన కల్పించాం. ఫలితంగా ఈసారి కంది సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ఉచితంగా కంది, పెసర విత్తనాలు ఇవ్వడంతో కొంతమంది రైతులు కొత్తగా పప్పు ధాన్యాల సాగుకు ముందుకొచ్చారు. రానున్న కాలంలో బోధన్ ప్రాంతంలో పప్పు ధాన్యాల సాగు మరింత పెరిగే అవకాశముంది.
-సంతోష్, ఏడీఏ, బోధన్