అలుగుపారిన రామడుగు
గోదావరికి భారీ ఇన్ఫ్లో.. ఎస్సారెస్పీ12 గేట్ల ఎత్తివేత
వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో సోమవారం కురిసిన వర్షాలకు పలు ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ధర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టు అలుగు పారింది. ఇక సింగీతం ప్రాజెక్టులోనూ వరద నీరు మత్తడి దుంకుతున్నది. ఎగువన భారీ వర్షాలతో గోదావరిలో క్రమంగా వరదప్రవాహం పెరుగుతున్నది. ఫలితంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 12 గేట్లను అధికారులు ఎత్తారు.
‘రామడుగు’ అలుగు పారింది..
ధర్పల్లి, ఆగస్టు 30 : రామడుగు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో అలుగు పారుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1278.300 అడుగులకు గాను పూర్తిస్థాయిలో నిండి సుమారు 88 క్యూసెక్కుల నీరు అలుగు నుంచి పారుతున్నదని ప్రాజెక్టు ఏఈ ప్రశాంత్ తెలిపారు. కుడి కాలువ ద్వారా 48 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 10 క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 100 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందన్నారు.
ఎస్సారెస్పీ 12 గేట్ల ఎత్తివేత
మెండోరా(ముప్కాల్), ఆగస్టు 30: శ్రీరాసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 30,620 క్యూసెక్కుల వరద వస్తున్నది. సోమవారం సాయంత్రం రెండు వరద గేట్లను ఎత్తి దిగువకు మిగులు జలాలను వదిలారు. ఇన్ఫ్లో పెరగడంతో రాత్రి మరో పది గేట్లను ఎత్తి మొత్తం 12 గేట్ల ద్వారా 37,420 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు. జెన్కోకు 7,500 క్యూసెక్కులు, సరస్వతీ కాలువకు 800, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలకు 675, లక్ష్మి కాలువకు 180 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి పూర్తిస్థాయి నీటిమట్టం కలిగి ఉన్నది. కాగా ప్రాజెక్టును ఆర్డీవో శ్రీనివాసులు సందర్శించారు.
ఖలీల్వాడి, ఆగస్టు 30: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా వర్షం కురుస్తున్నది. ఆదివారం నిజామాబాద్ జిల్లాలో 12.1 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చందూర్ మండలంలో 52.8మి.మీ వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా వేల్పూర్ మండలంలో 0.4 మి.మీ. నమోదైంది. మరో వారం రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
పొంగిపొర్లుతున్న సింగీతం
నిజాంసాగర్, ఆగస్టు 30: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 565 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు నీటి పారుదల శాఖ డీఈఈ శివకుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 1398.38 అడుగుల (9.70 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. సింగీతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 416.50 మీటర్లు నిండి ఉండగా ఎగువ భాగం నుంచి 300 క్యూసెక్కుల ఇన్ఫ్లోగా వస్తుండడంతో 150 క్యూసెక్కుల నీటిని వరద గేట్ల ద్వారా ప్రధాన కాలువకు విడుదల చేస్తుండగా మరో 150 క్యూసెక్కుల నీరు అడ్డుగోడ ద్వారా పొంగిపొర్లుతూ మంజీరలోకి ప్రవహిస్తున్నది.
పోచారంలోకి ఇన్ఫ్లో ..
నాగిరెడ్డిపేట్: ఆగస్టు 30 : నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో వస్తున్నదని ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం 433 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 20.5 అడుగుల నీరు నిల్వ ఉన్నట్లు డీఈఈ తెలిపారు.
పొంగిపొర్లుతున్న రాంపూర్వాగు
పిట్లం, ఆగస్టు 30 : ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి పిట్లం మండలంలోని రాంపూర్ వాగు పొంగిపొర్లింది. దీంతో పిట్లం-బాన్సువాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగు వద్ద పరిస్థితిని ఎస్సై రంజిత్ పర్యవేక్షించారు. వాహనదారులు, ప్రజలు అటువైపు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. వాగు వద్ద సిబ్బందిని ఏర్పాటు చేశారు.