ప్రత్యేకంగా నిధుల మంజూరుతో జోరుగా అభివృద్ధి
ఆహ్లాదం పంచుతున్న పల్లెప్రకృతి వనం
పూర్తయిన వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్డు
నిజామాబాద్ రూరల్, ఆగస్టు 30: నిజామాబాద్ మండలం మల్లారం గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉన్న చక్రధర్నగర్ తండా, గొల్లగుట్ట తండా కలిపి రెండేండ్ల క్రితం కొత్తగా ఏర్పడింది చక్రధర్నగర్ తండా గ్రామపంచాయతీ. నిధులు నేరుగా మంజూరయ్యే అవకాశం ఏర్పడడంతో ఆశించిన అభివృద్ధి కళ్లెదుట కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మల్లారం జీపీలో విలీనమై ఉన్నన్ని రోజులు అప్పటి సమైక్య పాలనలో చాలీచాలనీ నిధుల మంజూరుతో చక్రధర్నగర్ తండా, గొల్లగుట్ట తండాలు అభివృద్ధికి నోచుకోలేని దుస్థితి నెలకొంది. ప్రస్తుతం అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పంచాయతీ ఏర్పాటు చేయడంతోపాటు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లెప్రగతి ద్వారా ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తుండడంతో రెండు తండాలు అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.12.60 లక్షలతో రెండు తండాలకు సమీపంలో వైకుంఠధామాన్ని నిర్మించారు. వైకుంఠధామం ఆవరణలోని ముళ్లపొదలు, పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రపరిచారు. గుంతలమయంగా ఉన్న స్థలంలో రూ.40వేలతో మొరం వేసి చదును చేసి పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. వివిధ రకాల మొక్కలతో పచ్చదనం వెల్లివిరుస్తున్నది.
మరింత అభివృద్ధి చేస్తాం
పల్లెప్రగతితో ఊహించని అభివృద్ధి జరగడంతో ప్రజలందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీపీ పాలకవర్గం, అధికారులు, గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో రెండు తండాల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు కృషి చేస్తా.
కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం
మా తండాకు గ్రామ పంచాయతీ హోదా కల్పించిన సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం. పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి పుష్కలంగా నిధులు మంజూరు చేయడంతో గ్రామాలన్నీ అనుకున్న దానికన్నా అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నాయి.
పచ్చదనం, పరిశుభ్రత..
జీపీ తరఫున రూ.9.50 లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్ కొనుగోలు చేశారు. ఇంటింటికీ వెళ్లి పారిశుద్ధ్య కార్మికులు చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్తతో కంపోస్ట్ షెడ్డులో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు మురికి కాలువలను శుభ్రం చేయడంతో కాలనీలు శుభ్రంగా మారుతున్నాయి. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా, ఆర్అండ్బీ రోడ్డుకి ఇరువైపులా, ఇంటి ఆవరణల్లో విస్తృతంగా మొక్కలు నాటడంతో అవి ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. చక్రధర్నగర్ తండాలో రూ.5లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. గొల్లగుట్ట తండాలో పది మట్టి రోడ్లు తీసి ఇరువైపులా కచ్చ కాలువలు ఏర్పాటు చేశారు.
విద్యుత్ సమస్యలు పరిష్కారం
ఏండ్ల తరబడి ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలకు పల్లెప్రగతి ద్వారా పరిష్కారం లభించింది. కొత్తగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయటంతోపాటు రెండు తండాల్లో అవసరమున్న చోట 13 విద్యుత్ స్తంభాలు కొత్తగా ఏర్పాటు చేశారు. ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగలను పునరుద్ధరించారు.