
జిల్లాలో మొదలైన కసరత్తు
19 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడికి ప్రతిపాదన
150 మంది విద్యార్థులను మించి ఉన్న బడులకు హెచ్ఎం
ప్రభుత్వ మార్గదర్శకాలు, ఆదేశాల ప్రకారంపూర్తికానున్న ప్రక్రియ
ఉపాధ్యాయుల హేతుబద్ధ్దీకరణకు ప్రభుత్వం అనుమతిచ్చిన
నేపథ్యంలో జిల్లాలో విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.
ఇప్పటికే యూడైస్ ఆన్లైన్ ప్రక్రియ ముగియడంతో పాఠశాలల హేతుబద్ధ్దీకరణ పనులు మరింత వేగవంతం కానున్నాయి. యూడైస్ 2019-20 విద్యాసంవత్సరం గణాంకాలను పరిగణలోనకి తీసుకోవడం, కొవిడ్ నేపథ్యంలో హేతుబద్ధ్దీకరణ వాయిదా పడుతూ వచ్చింది. కొద్ది రోజులుగా డీఈవో కార్యాలయంలో అధికారులు, ఉపాధ్యాయుల వివరాలను పాఠశాలల స్థాయి నుంచి సేకరించి మదింపు పనులు చేస్తున్నారు. వివరాలను క్రోడీకరించిన అనంతరం ఉన్నతాధికారులకు నివేదికను అందజేస్తామని అధికారులు తెలిపారు.
డేటా సమర్పించిన ఎంఈవోలు..
విద్యాశాఖ పరిధిలోని తెలుగు, ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలను ఎంఈవోలు పరిశీలించి, పాఠశాలల్లోని సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ), ప్రధానోపాధ్యాయులు(హెచ్ఎం) హోదాలకు అనుగుణంగా క్యాడర్ స్ట్రెంత్, యూడైస్ ఎన్రోల్మెంట్లను డీఈవోకు అందజేశారు. గత విద్యాసంవత్సరం (2020-21) యూడైస్ విద్యార్థుల సంఖ్య ఆధారంగా చేపట్టనున్నారు. ఈ మేరకు ఆగస్టు 18న విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ జీవో నంబర్ 28ని జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 150 కంటే విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న పాఠశాలలకే ప్రధానోపాధ్యాయులు ఉంటారు. 19మంది విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఉండేలా ప్రతిపాదించారు. ఒకే బడి ఆవరణలో ప్రాథమిక, ప్రాథమికోన్నత లేదా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉంటే వాటిని విలీనం చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అంతేగాకుండా ఉన్నత పాఠశాలల్లో తెలుగు మాధ్యమానికి సమాంతరంగా ఆంగ్ల మాధ్యమ సెక్షన్లు నడుస్తూ, వాటిల్లో 50 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే ఆంగ్లమాధ్యమ విద్యార్థులను సమీపంలోని మరోబడిలో చేరుస్తారని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఏదేమైనా జిల్లా విద్యాశాఖ చేస్తున్న ఈ కసరత్తు అనంతరం పూర్తి వివరాలతో నివేదిక సిద్ధ్దమవుతుందని భావిస్తున్నారు.
పెరిగిన ప్రవేశాలు..
ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల ప్రవేశాలు పెరిగాయి. అంగన్వాడీ కేంద్రాల నుంచి చిన్నారులు ప్రాథమిక పాఠశాలల్లో చేరుతుండడంతో ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గతంతో పోల్చుకుంటే అధికమైంది. దీంతో ప్రస్తుత హేతుబద్ధ్దీకరణలో ప్రాథమిక పాఠశాలల్లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని విద్యాశాఖ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. తక్కువ మంది విద్యార్థులతో నెట్టుకొస్తున్న పాఠశాలల ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు భరోసా కల్పించి వారి ప్రవేశాలు కల్పించాల్సి వస్తుంది. దీంతో ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరే అవకాశంతో పాటు బలోపేతం కావడానికి వీలు కలుగుతుంది.
మెదక్ జిల్లాలో పాఠశాలలు, ఉపాధ్యాయుల వివరాలు ..
మెదక్ జిల్లాలో 924 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 129, ప్రాథమికోన్నత పాఠశాలలు 624, ఉన్నత పాఠశాలలు 159 ఉన్నాయి. వీటిలో పీజీ హెచ్ఎంలు 60, భాషా పండితులు 305, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు 60, స్కూల్ అసిస్టెంట్లు 1157, పీఈటీలు 52, ఎస్జీటీలు 1860 మంది విధులు నిర్వహిస్తున్నారు.