
మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
జిల్లా కేంద్రంలో ఘనంగా జాతీయ క్రీడాదినోత్సవం
ఉత్సవంగా 4కే, 2కే రన్
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 29: హాకీలో దేశానికే వన్నె తెచ్చిన మహనీయుడు ధ్యాన్‌చంద్ అని, పట్టుదల దీక్షతో ముందుకెళ్తే ఏ రంగంలోనైనా రాణిస్తారని, ప్రతి క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ఆదివారం పెట్స్ క్లబ్, పీఈటీ, జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కేంద్రంలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్ ఎక్స్‌రోడ్ నుంచి యువకులకు 4కే రన్, బస్సు డిపో వద్ద నుంచి బాలికలకు 2కే రన్‌ను అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ధ్యాన్‌చంద్ చౌరస్తాలోని ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలకూ ప్రాధాన్యమివ్వాలన్నారు. హాకీలో ప్రపంచంలోనే భారతదేశ కీర్తి ప్రతిష్టలని నిలిపిన ధ్యాన్‌చంద్ జయంతిని ఈనాడు క్రీడా దినోత్సవంగా జరుపుకొంటున్నామని తెలిపారు. అంతకుముందు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మాట్లాడుతూ క్రీడాకారులు అంకితభావంతో ముందుకెళ్లాలన్నారు. క్రీడాలకు ధనిక, పేద అనే తేడా ఉండదని, క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు షూ అందజేస్తామన్నారు. ద్వారకా చారిటబుల్ సొసైటీ చైర్మన్ మ్యాడం బాలకృష్ణ మాట్లాడుతూ క్రీడల ప్రోత్సాహానికి ఎల్లవేళలా సొసైటీ సహాయ సహకారాలు ఉంటాయన్నారు. అంతకుముందు సమావేశానికి అధ్యక్షత వహించిన పెట్స్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ పెట్స్ క్లబ్‌కు స్థలం, భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే స్థలంతో పాటు భవన నిర్మాణానికి నిధులు కేటాయించి సహకారం అందిస్తానని తెలిపినట్లు పేర్కొన్నారు. అనంతరం జిల్లా యువజన, క్రీడల అధికారి నాగరాజు, పీఈటీ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్‌రావు, రవి, నాగరాజు, జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యుడు జుబేద్ తదితరులు మాట్లాడారు.
విజేతలకు సైకిళ్ల అందజేత…
4కే రన్ బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన మెదక్ పట్టణానికి చెందిన సంజు, 2కే రన్ బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన డిగ్రీ విద్యార్థిని దీపికకు ద్వారకా చారిటబుల్ సొసైటీ సౌజన్యంతో సైకిళ్లతో పాటు పతకాలను అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అందజేశారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారితో పాటు పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులకు పతకాలు, ట్రాక్ సూట్లు అందజేశారు. అంతేగాకుండా ప్రతి సంవత్సరం 4కే రన్ పాల్గ్గొంటున్న 74 సంవత్సరాల శిభతుల్లాకు రూ.వెయ్యి ప్రోత్సాహకంగా అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, పీఈటీలు మాధవరెడ్డి, దేవేందర్‌రెడ్డి, వినోద్, మహిపాల్, సుధాకర్, నరేశ్, మాధవ్, రాజేందర్, స్పోర్ట్స్ ఫౌండేషన్ సభ్యులు మహేందర్‌రెడ్డి, ఎంఎల్ఎన్ రెడ్డి, కొండ శ్రీనివాస్, ఉమర్, మొహిజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇండోర్ స్టేడియంలో ఘననివాళి
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా విద్యాశాఖధికారి రమేశ్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ హాజరై ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, వినోద్‌కుమార్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మధు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.