
గదులు, వంట పాత్రలు, పరిసరాలను శుభ్రం చేయండి
జడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ మనోహరాబాద్ మండలం
కూచారం, ముప్పిరెడ్డిపల్లిలో పాఠశాలలను పరిశీలన
మనోహరాబాద్, ఆగస్టు 28 : పాఠశాలలను తప్పనిసరిగా శానిటైజేషన్ చేయాలని జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్ అధికారులకు, ఉపాధ్యాయులకు సూచించారు. మనోహరాబాద్ మండలం కూచారంలోని కస్తూర్భా బాలికల హాస్టల్‌ను, ముప్పిరెడ్డిపల్లిలో జడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాలలను శనివారం పరిశీలించారు. ఆయా పాఠశాలల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని పరిశీలించారు, సరిగ్గా ఉంటేనే వంటకు ఉపయోగించాలన్నారు. వంటగదిలో వంట పాత్రలను శుభ్రపరిచి, అన్ని సామాగ్రిని తెచ్చుకోవాలని తెలిపారు. మరుగుదొడ్లు శుభ్రం చేసి పరిసరాల్లో కలుపుమొక్కలు లేకుండా చూడాలన్నారు. ప్రతి తరగతి గదిని, బెంచిలను శానిటైజేషన్ చేయాలన్నారు. సెప్టెంబర్ 1 న పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు ఏర్పాటు చేయాలన్నారు. కరోనా నిబంధనలు పాటించే విధంగా చూడాలన్నారు. ముప్పిరెడ్డిపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. ముప్పిరెడ్డిపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు అదనపు గది కావాలని గ్రామ సర్పంచ్ ప్రభావతిపెంటయ్య కోరడంతో రూ. 10 లక్షలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈవో రమేశ్, ఇన్చార్జి ఎంఈవో యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు పురం మహేశ్, ఎంపీపీ నవనీతరవి, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీటీసీ స్వర్ణలతవెంకటేశ్, ఎంపీడీవో జైపాల్‌రెడ్డి, సర్పంచ్ ప్రభావతిపెంటయ్య, నాయకులు నర్సింహ, రమేశ్ పాల్గొన్నారు.