
క్రీడల్లో రాణిస్తున్న బొల్లారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు
జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు
బొల్లారం, ఆగస్టు 28 : ప్రతీవ్యక్తి జీవితంలో క్రీడలు, రోజువారి కార్యకలాపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ఈ రోజు ప్రధాన లక్ష్యం.. హాకీలో భారత కీర్తిని ప్రపంచానికి చాటిన హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ జయంతి నేడు. ఆ మహనీయుడిని గుర్తు చేసుకుంటూ బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ ఆదర్శపాఠశాలకు చెందిన మట్టిలో మణిక్యాలపై ప్రత్యేక కథనం.
రాష్ట్రస్థాయిలో మెరిసిన కబడ్డీ క్రీడా రత్నాలు..
పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికై తమ విశేష ప్రతిభతో పతకాలు సాధించారు. ఇందులో తేజస్విని, ప్రియాంక, నిషా, అంజలి, మమత, లహరి ఉన్నారు. సీనియర్స్ విభాగంలో మేడ్చెల్ జిల్లాలో జరిగిన క్రీడల్లో పాఠశాల తరఫున పాల్గొన్న దేవి, నిషా, ప్రియాంక ఉత్తమ ప్రతిభతో రాష్ట్రస్థాయికి సంగారెడ్డి జిల్లా తరఫున ఎంపికయ్యారు. ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి బాక్స్ లంగడి క్రీడల్లో ఇంటర్ డిస్ట్రిక్ ఛాంపియన్ షిప్ 2020-21లో పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ చాటి మెడల్స్ సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. వీరిలో ప్రియాంక (ఇంటర్ ప్రథమ), నిషా (ఇంటర్ ప్రథమ), హారిక (ఇంటర్ ప్రథమ), హేమంత్ కుమార్ (ఇంటర్ ద్వితీయ), కన్నీ (ఇంటర్ ద్వితీయ), తేజస్విని(10వ), చరణ్ (9వ తగరతి)లు ఉన్నారు.
గోల్కొండ వారియర్స్ టీమ్‌కు ఎంపిక..
పాఠశాలకు చెందిన క్రీడారత్నం జి.హారిక రాష్ట్రస్థాయిలో అథ్లెటిక్స్ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా గోల్కొండ వారియర్స్ టీమ్ తరఫున ఆడేందుకు ఎంపికైంది. టీమ్‌కు ఎంపిక కావడంతో ప్రిన్స్‌పాల్ శైలజ విద్యార్థిని హారిక, అందుకు ప్రోత్సహించిన పీడీ శశిరేఖను అభినందించారు.
ఆదర్శ పాఠశాల విద్యార్థుల
విజయ పరంపర..
ప్రతి సంవత్సరం జిల్లా స్థాయిలో నిర్వహించే అథ్లెటిక్స్ క్రీడల్లో ఒవరాల్ ఛాంపియన్స్‌గా నిలవడం విశేషం.
స్టూడెంట్స్ ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా పాఠశాల నుంచి జైపూర్‌లో జరిగిన జాతీయ స్థాయి క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 5 మంది క్రీడాకారులు ఏకంగా అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.
ఈ క్రీడల్లో ఆయా క్రీడాంశాల్లో 3 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ సాధించిన క్రీడాకారులు ఉన్నారు.
ఆదిలాబాద్ మంచిర్యాల్ పట్టణంలో జరిగిన రాష్ట్రస్థాయి మీట్లో పాఠశాల విద్యార్థులు మెడల్స్ సాధించారు.
గచ్చీబౌలి స్టేట్‌మీట్, ఆదర్శపాఠశాలల సొసైటీ మీట్స్ క్రీడల్లో పాల్గొని పతకాల పంట పండించారు.
మునిపల్లి, సిద్దిపేటలో జరిగిన ఉమ్మడి జిల్లా క్రీడల్లో ఖోఖో పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచారు.
నిరంతరం ప్రత్యేక శిక్షణ..
గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి క్రీడల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులను వెలికితీసి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నం. ప్రతిరోజూ గ్రౌండ్లో వ్యాయామ శిక్షణ, యోగాసనాలతో పాటు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, రన్నింగ్, లాంగ్‌జంప్, త్రోబాల్, అథ్లెటిక్స్ తదితర క్రీడల్లో ప్రత్యేక తర్పీదు అందిస్తున్నాం. విద్యార్థులకు సంబంధిత క్రీడల్లో మరింత ప్రోత్సాహం అందిస్తూ మెళకువలు నేర్పుతున్నాం.
పాఠశాల నుంచి అంతర్జాతీయ స్థాయికి..
క్రీడాకారులకు ప్రత్యేకమైన వసతులు లేకపోయినా అన్ని క్రీడాంశాల్లో ప్రతిభను చూపుతుండ్రు. ప్రస్తుతం ఉన్న గ్రౌండ్‌లోనే ప్రతిరోజూ క్రీడ సాధన చేయిస్తున్నాం. పీడీ శశిరేఖ, సహాయ కోచ్‌తో కలిసి అన్ని విధాల క్రీడాకారుల్లోని అద్భుత నైపుణ్యాలకు పదును పెట్టి మంచి ఫలితాలను సాధిస్తున్నాం. పాల్గొన్న ప్రతి మీట్లో పాఠశాల క్రీడాకారులు పతకాలను సాధించడం చాలా సంతోషంగా ఉంది.