
ఒలింపిక్స్‌లో భారత పతకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారుడు
22 ఏండ్ల పాటు హాకీకి సుదీర్ఘ సేవలు
హాకీ మాంత్రికుడిగా కీర్తి ప్రతిష్ఠలు
‘రాజీవ్ ఖేల్ రత్నా’ అవార్డును ‘ధ్యాన్‌చంద్ ఖేల్ రత్నా’ మార్చిన కేంద్రం
ధ్యాన్‌చంద్ విగ్రహం రెండోది మెదక్‌లోనే..
భారత హాకీని ప్రపంచానికి చాటిన క్రీడాకారుడు.. ఒలింపిక్స్‌లో భారత పతకాన్ని రెపరెపలాండించిన పౌరుడు.. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్. 22ఏండ్ల పాటు సుదీర్ఘ సేవలందించిన ఆయన జన్మదినం రోజున జాతీయ క్రీడా దినోత్సవంగా ఏటా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ధన్యజీవికి మరింత గౌరవం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ‘రాజీవ్ ఖేల్ రత్నా’ అవార్డును ‘ధ్యాన్‌చంద్ ఖేల్ రత్నా’గా మార్చింది. ధ్యాన్‌చంద్ మొదటి విగ్రహం దేశ రాజధానిలో ఉండగా, ఆయన శత జయంతిని పురస్కరించుకొని రెండో విగ్రహం మెదక్‌లో ఉంది.
అంతర్జాతీయ హాకీలో భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేసిన ధన్యజీవి ధ్యాన్‌చంద్. భారత హాకీకి విశేష సేవలందించిన ధ్యాన్‌చంద్ జన్మదినం ఆగస్టు 29. ఈ రోజునే జాతీయ క్రీడా దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఆ ధన్యజీవి జయంతిని పురస్కరించుకొని దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించారు. ఈ రోజునే ఉత్తమ క్రీడాకారులకు భారత ప్రభుత్వం ‘అర్జున’, ‘ద్రోణాచార్య’, ‘రాజీవ్ ఖేల్ రత్నా’ (రాజీవ్ ఖేల్ రత్నా అవార్డును ఈ సంవత్సరం నుంచి ధ్యాన్‌చంద్ ఖేల్ రత్నా అవార్డుగా కేంద్ర ప్రభుత్వం మార్చింది) లాంటి అవార్డులు, పురస్కారాలు ఇచ్చి గౌరవ సన్మానం చేస్తుంది. ధ్యాన్‌చంద్ 1905 ఆగస్టు 29న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో నిరుపేద కుటుంబంలో జన్మించాడు.ధ్యాన్‌చంద్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఫార్వర్డ్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. బంతిని డ్రిబ్లింగ్ చేస్తున్నప్పుడు హాకీ స్టిక్, బంతి రెండు అతుక్కొని పోయాయా అన్న భ్రమ కలిగించే విధంగా క్రీడా నైపుణ్యం ప్రదర్శించే వాడని ఒక సందర్భంలో విదేశీయులు ఆయన స్టిక్‌లో అయస్కాంతం ఉందా అని స్టిక్‌ను విరిచి చూడటం ధ్యాన్‌చంద్ క్రీడా నైపుణ్యానికి అద్దం పడుతుంది.
భారత ఆర్మీలో చేరిక..
ధ్యాన్‌చంద్ 1922లో భారత ఆర్మీలో చేరి 1926లో భారత సైనిక హాకీకి ప్రాతినిథ్యం వహించాడు. 1928, 1932, 193 6 ఒలింపిక్స్ క్రీడల్లో భారత హాకీకి వరుస స్వర్ణ పథకాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 1934లో భారత హాకీ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 1948లో ధ్యాన్‌చంద్ హాకీ నుంచి రిటైర్ అయ్యాడు. 1930లో భారత జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించి 48 మ్యాచ్‌లు ఆడి 584 గోల్స్ చేయగా.. ఇందులో 201 గోల్స్ ధ్యాన్‌చంద్ వ్యక్తిగతంగా చేసినవే. వ్యక్తిగతంగా 201 గోల్స్ చేసి ప్రపంచ చరిత్ర పుటల్లో పేరు సంపాదించుకున్నాడు.
అనారోగ్యంతో మృతి..
ధ్యాన్‌చంద్ 64వ ఏట అనారోగ్యంతో మృతి చెందాడు. 1979 డిసెంబర్ 3న తుదిశ్వాస విడిచాడు. ఈ హాకీ దిగ్గజం మరణానంతరం అతడి జన్మదినాన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. 22 సంవత్సరాల పాటు హాకీకి సుదీర్ఘ సేవలు అందించడమే కాకుండా జట్టుకు గుండెకాయగా ధ్యాన్‌చంద్ నిలిచాడు.
రాష్ట్రంలో మొదటిది.. దేశంలో రెండోది..
ధ్యాన్‌చంద్ విగ్రహాన్ని మొదటిసారిగా దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ప్రతిష్టించారు. అనంతరం ధ్యాన్‌చంద్ శత జయంతిని పురస్కరించుకొని దేశంలోనే రెండో విగ్రహం మెదక్‌లోని బోధన్-మెదక్ చౌరస్తాలో 2005 ఆగస్టు 29న మెదక్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించారు. ఈ చౌరస్తాను ప్రస్తుతం ధ్యాన్‌చంద్ చౌరస్తాగా పిలుస్తున్నారు. మెదక్‌లో ధ్యాన్‌చంద్ విగ్రహం ప్రతిష్టించే నాటికి మన రాష్ట్రంలో మొదటిది. దేశంలో రెండోది. ఇక్కడి స్పోర్ట్స్ అసోసియేషన్ స్ఫూర్తిని కొనియాడుతూ.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో మూడో విగ్రహాన్ని ప్రతిష్టించారు.
తాత్కాలికంగా విగ్రహం తొలిగింపు..
రోడ్డు విస్తరణతో పాటు ధ్యాన్‌చంద్ చౌరస్తా సుందరీకరణల నేపథ్యంలో ధ్యాన్‌చంద్ విగ్రహాన్ని తొలిగించి ఇందిరాగాంధీ స్టేడియంలో భద్రపరిచారు. సుందరీకరణ పనులు పూర్తికాగానే విగ్రహాన్ని పునఃప్రతిష్టించనున్నారు.
హాకీ అభివృద్ధే ధ్యాన్‌చంద్‌కు నివాళి..
నిరుపేద కుటుంబంలో పుట్టిన ధ్యాన్‌చంద్ హాకీలో ప్రపంచంలోనే భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చాడు. దేశంలో ప్రతి గ్రామంలో హాకీని అభివృద్ధి చేయడమే ధ్యాన్‌చంద్‌కు ఘననివాళి. ధ్యాన్‌చంద్ ఒలింపిక్స్‌లో ప్రతి మ్యాచ్ విజయాన్ని కోరుకున్నారు. ధ్యాన్‌చంద్ చూపిన ప్రతిభ వల్లే హాకీ ప్రపంచంలో ఎంతో గుర్తింపు పొందింది. ప్రతి ఒక్క క్రీడాకారుడు క్రీడల్లో రాణించి ధ్యాన్‌చంద్ ఆశయం నెరవేర్చాలి.
ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి..
హాకీక్రీడా మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌ను క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలి. ధ్యాన్‌చంద్ తన క్రీడానైపుణ్యంతో దేశానికే వన్నె తెచ్చారు. ప్రతి క్రీడాకారుడు జీవితంలో క్రీడలు ఒక భాగమనే స్ఫూర్తితో పట్టుదల, కృషితో ముందుకు వెళ్లాలి.