
పురుగులు పట్టిన బియ్యాన్ని వండి పెట్టొద్దు
నిబంధనలు పాటించాల్సిందే హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు
ప్రత్యేక దృష్టి పెట్టాలిలక్షణాలుంటే టీచర్లు
పరీక్షలు చేయించుకోవాలితర్వాత ప్రారంభకానున్న పాఠశాలలు
పునః ప్రారంభంపై సమీక్షా సమావేశం
ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్, ఆగస్టు 27 : పాఠశాలలకు వచ్చే విద్యార్థులను మీ పిల్లల్లాగా చూసుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్, డీఈవో రమేశ్‌కుమార్, డీపీవో తరుణ్‌కుమార్, పంచాయతీరాజ్ ఈఈ రాంచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్‌తో పాటు మెదక్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలతో పాఠశాలల పునః ప్రారంభంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర నుంచి పాఠశాలలు మూతపడ్డాయని, పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ సెప్టెంబర్ ఒకటి నుంచి పాఠశాలలను పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలను ప్రారంభిస్తామన్నారు. ఇందుకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. పాఠశాలల్లో శానిటేషన్, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ఎంఈవో, ప్రధానోపాధ్యాయులదే బాధ్యత..
ఏడాదిన్నర తర్వాత ప్రారంభమవుతున్న పాఠశాలల బాధ్యతలు ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన పాఠశాలలకు మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని పంచాయతీరాజ్ ఈఈ రాంచంద్రారెడ్డిని ఆదేశించారు.
పురుగులు పట్టిన బియ్యాన్ని వండొద్దు..
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద ఏడాదిన్నర కిందట పంపిణీ చేసిన బియ్యం పురుగులు పట్టాయని, వాటిని వండొద్దని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రధానోపాధ్యాయులకు సూచించారు. తిరిగి వాటిని గోదాంలోకి పంపివేయాలని, వాటి స్థానంలో అధికారులు నాణ్యమైన బియ్యాన్ని అందజేస్తారని తెలిపారు. అవసరమున్న పాఠశాలలకు మిషన్ భగీరథ పథకం కింద నీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ధైర్యంగా పాఠశాలలకు పంపాలని కోరారు. మండలాల్లోని అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాఠశాలలను సందర్శించి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు రాగి అశోక్, లింగారెడ్డి, కౌన్సిలర్లు జయరాజ్, కిశోర్, లక్ష్మీనారాయణగౌడ్ పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన బియ్యం సరఫరా చేస్తాం:
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతున్న పాఠశాలలకు మధ్యాహ్న భోజనానికి బియ్యాన్ని సరఫరా చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ జి.రమేశ్ తెలిపారు. పాఠశాలల్లో శానిటేషన్, తాగునీటిని కల్పిస్తున్నామన్నారు. పాఠశాలల్లో చేసిన పనులకు పెండింగ్ ఉన్న బిల్లులను చెల్లిస్తున్నామన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
అన్ని సౌకర్యాలు కల్పించాం :
సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని డీఈవో రమేశ్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే ఎంఈవోలతో పాటు ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేశామన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు విద్యాబోధన చేయాలన్నారు. మెదక్ జిల్లాను సక్సెస్ చేయాలని సూచించారు.
శుభ్రత బాధ్యత పంచాయతీలదే:
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లోని పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనని డీపీవో తరుణ్‌కుమార్ తెలిపారు. ముఖ్యంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు, వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచులతో పాటు పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాఠశాలల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. లీకేజీలు ఉంటే వెంటనే చేయించేలా సర్పంచ్‌లకు, పంచాయతీ కార్యదర్శులకు సూచించామన్నారు.