
పల్లెల్లో పరుగులు తీస్తున్న విద్యుత్ వాహనాలు
సామాన్యులకు అందుబాటులోకి..
కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న ప్రజలు
రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
కాలుష్య నివారణకు దోహదం
రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యానికి చెక్ పెట్టేందుకు.. భారీగా పెరిగిన పెట్రోలు ధరల నుంచి విముక్తికి విద్యుత్ వాహనాలు (ఈవీ) పల్లెలకు దూసుకు వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో విద్యుత్ బైక్‌ల (ఈవీ) వాడకం పెరిగింది. రెండు, మూడు గంటలు చార్జింగ్ పెడితే 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు వీటి ద్వారా ప్రయాణించవచ్చు. దీంతో చాలామంది కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. రైతులు, పాల వ్యాపారులు, చిరు వ్యాపారులు, పర్యావరణ ప్రేమికులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేయడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు.
ప్రజా రవాణా అవసరాలను తీర్చేందుకు విద్యుత్‌తో నడిచే ఫ్లీట్ కార్లు, ఈ బస్సులు, 3 వీలర్లు, 2 వీలర్లు, ఈ బైక్‌లు భారీగా అందుబాటులోకి వస్తున్నాయి. భారతీయ రోడ్లను పూర్తిగా పొల్యూషన్‌ను తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలతో నింపేందుకు తయారీ సంస్థలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఓ 30 ఏండ్లు వచ్చేసరికి భారతదేశంలో పొల్యూషన్ 100% తగ్గించి మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని తయారీదారులు ఆ దిశగా పనిచేస్తున్నారు.
పొల్యూషన్ లేని బ్యాటరీ 2 వీలర్ బైక్‌లు పట్టణాలోనే కాదు గ్రామాల్లో కూడా పరుగులు పెడుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లకు రెండు, మూడు గంటల చార్జింగ్ పెట్టినట్లయితే 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు సులభంగా ప్రయాణించొచ్చని వాహన దారులు చెబుతున్నారు. చేగుంట మండల పరధిలోని బోనాల్కు చెందిన రైతు జోర్రు లింగం తన పొలం పనులకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి రూ.29వేలతో బ్యాటరీ బైక్‌ను కోనుగోలు చేశాడు. దీంతో ఏ ఇబ్బంది లేకుండా హాయిగా తన పొలం పనులకు వినియోగించుకుంటున్నాడు. బ్యాటరీ బైక్‌కు ఒక్క రోజు చార్జింగ్ పెడితే వారం రోజులు నడుస్తుందని, రామాయంపేట, గజ్వేల్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులు, విత్తనాల సంచులను బైక్‌పైన తెచ్చుకుంటున్నానని లింగం తెలిపారు. కర్నాల్పల్లికి చెందిన వంటరి అశోక్‌రెడ్డితో పాటు మధుసూదన్డి తెచ్చుకున్న బ్యాటరీ వాహనాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని వారు తెలిపారు. చేగుంటకు చెందిన ఓ పాల వ్యాపారి సురేశ్ తన ఎలక్ట్రిక బైక్‌పై ప్రతి రోజూ 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు వెళ్లి పాల దందా చేసుకుంటున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి బ్యాటరీ చెత్త వాహనాలు, దివ్యాంగులకు బ్యాటరీ రిక్షాలను అందజేసింది. డీజిల్, పెట్రోల్, పొల్యూషన్ లేకుండా నడిచే వాహనాలు రావడం సంతోషంగా ఉందని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బ్యాటరీ బైక్‌ను కొనుగోలు చేశా..
చేతిలో బైక్ లేక వ్యవసాయ పొలానికి వెళ్లడానికి ప్రతి రోజూ చాలా ఇబ్బంది పడేవాడిని. కానీ, మార్కెట్లో ఎలక్ట్రిక్ బైక్‌లు అందుబాటులోకి వచ్చాయని తెలిసి వెంటనే దగ్గరలో ఉన్న బైక్ షోరూం కి వెళ్లి రూ.60వేలతో బ్యాటరీ బైక్‌ను కొనుగోలు చేశాను. ఇప్పుడు పొలానికి వెళ్లడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. బైక్‌పై హాయిగా వెళ్లి పనులు చూసుకొని తిరిగి ఇంటికి చేరుకుంటున్నా. ఎరువులు, విత్తనాల సంచులు బైక్‌పైనే తీసుకొస్తున్నా. మూడు గంటలు చార్జింగ్ పెడితే 80 కిలోమీటర్ల వరకు వస్తుంది. అదనంగా బ్యాటిరీ తెచ్చుకోవడంతో ఇటీవల మా ప్యామిలీతో హైదరాబాద్‌కు కూడా వెళ్లి వచ్చా.
ఈ మధ్యన పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరగడంతో బైక్‌ను తీయాలంటే ప్రతిరోజూ చాలా బయపడేవాడిని. కానీ, మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలు అందుబాటులోకి వచ్చాయని తెలిసి రూ.60వేలు పట్టుకొని బైక్ షోరూంకి వెళ్లి ఒక ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేశాను. ఇప్పుడు ఒకసారి చార్జింగ్ పెడితే చాలు 80 కిలోమీటర్ల వరకు వస్తుంది. పెట్రోల్ ఖర్చు తగ్గింది. బ్యాటరీ వాహనం కావడంతో మా ఇద్దరు పిల్లలు సులభంగా డ్రైవింగ్ నేర్చుకున్నారు.