
అందుబాటులో నాలుగు కోట్ల పుస్తకాలు
ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిక్షిప్తం
సద్వినియోగం చేసుకుంటున్న విద్యార్థులు
కరోనా కారణంగా ఏడాదికి పైగా గ్రంథాలయాలు మూసిఉన్నాయి.
తెరుచుకున్నా పాఠకుల నుంచి అంతగా స్పందన రాలేదు. దీంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు సైతం పూర్తిస్థాయిలో చదువుకోలేక
నష్టపోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లైబ్రరీని తెరపైకి తీసుకొచ్చింది. యవత, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా
నాలుగుకోట్లకుపైగా పోటీ పరీక్షల పుస్తకాలు డిజిటలైజేషన్ చేసి అందుబాటులో ఉంచింది.
గ్రామీణ విద్యార్థులు సైతం..
గతంలో పట్టణ, నగర విద్యార్థులకు మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉండేది. ప్రస్తుతం గ్రామీణ విద్యార్థులు సైతం ఇంటర్నెట్ వాడుతున్నారు. గ్రామీన ప్రాంతాల్లోనూ మొబైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో డిజిటల్ లైబ్రరీని వినియోగించుకుంటున్నారు. డిజిటలైజేషన్ పుణ్యమా అని గ్రామీణ విద్యార్థులు సైతం ఇతర విద్యార్థులతో పోటీపడుతున్నారు. పోటీ పరీక్షల్లో కూడా గ్రామీణ విద్యార్థులు ర్యాంకులు సంపాదించి ముందుకు దూసుకువెళ్తున్నారు.
ఇంగ్లిష్, హిందీ భాషల్లో..
కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఖరగ్‌పూర్ ఐఐటీ వారు డిజిటల్ లైబ్రరీని తయారు చేశారు. అందులో విషయ నిపుణుల వీడియోలు పొందుపర్చారు. పాఠశాల, కళాశాల, ఇంజినీరింగ్, వైద్య విద్య, న్యాయవిద్య, సాహిత్యం, సంస్కృతం ఇలా అన్ని స్టడీ మెటీరియల్స్‌ను ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిక్షిప్తం చేశారు. ప్రధానంగా పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలన్నీంటినీ అందులో జోడించారు.
అందుబాటు ధరలో మొబైల్ డేటా..
కరోనా కారణంగా ఇటీవల వరకు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు విన్నారు. ప్రస్తుతం చాలా కంపెనీలు సైతం హోం టూ వర్కు అవకాశం కల్పించాయి. దీంతో పెద్ద మొత్తంలో మొబైల్, ల్యాప్‌టాప్‌ల వాడకం పెరిగింది. అంతేకాకుండా ఉద్యోగాల కోసం కోచింగ్‌కు వెళ్లే అభ్యర్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ కంపెనీలు /టెల్కోలు మొబైల్డేటాను తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చాయి. గ్రామీణ విద్యార్థులు సైతం ఎక్కువగా మొబైల్ డేటా ద్వారా డిజిటల్ లైబ్రరీని సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఇలా తెరవండి..
ముందుగా స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లో గూగుల్ లింక్‌ను క్లిక్ చేస్తే చాలు డిజిటల్ లైబ్రరీ తెరుచుకుంటుంది. అవసరం అనుకుంటే డౌన్లోడ్ సైతం చేసుకోవచ్చు. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అని టైప్ చేసి ప్లేస్టోర్ నుంచి https//:ndl.iitkgp.ac.in/, https:///t.co8kwziecw లింక్‌ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.