
వేడివేడి మొక్కజొన్న కంకులకు భలే గిరాకీ
మెండుగా పోషకాలు
కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న ప్రజలు
లేత మొక్కజొన్న కంకులకు ఎర్రటి నిప్పులపై కాల్చి, ఒక నిమ్మకాయ పచ్చతో కొంచెం ఉప్పు రుద్దేసి ఒక్కొక్క గింజను వలిచి తింటుంటే ఆ రుచే వేరు… చదువుతుంటే నోరూరుతున్నది కాదు..! అవును నిజమే. ఈ వర్షాకాలంలో వీటిని తింటుంటే ఆ రుచిని ఇష్టపడని వారంటూ ఉండరు. మొక్కజొన్నలో శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉంటాయి. కాల్చినా, ఉడికించి తిన్నా ఈ పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా గర్భిణులకు అవసరమైన పోలేట్ శాతం ఈ గింజల నుంచి ఎక్కువగా లభిస్తుంది.
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 3: మొక్కజొన్నలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటి గురించి తెలిసిన వారు మొక్కజొన్న కంకులు ఎక్కడ కనబడినా కొనకుండా ఉండలేరు. శరీరానికి అవసరమైన ఏ, బీ, సీ, ఈ మొక్కజొన్నలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మొక్కజొన్న తినడం వలన అందులోని విటమిన్లు జీర్ణ వ్యవస్థను మెరుగు పర్చడంతో పాటు మల బద్ధకాన్ని నివారించే టానిక్‌లా పనిచేస్తాయి. ఘగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా మొక్కజొన్నను తినేందుకు మొగ్గు చూపుతున్నారు. అల్జీమర్స్, బీపీ, గుండె సంబంధిత రోగాలకు కొంత ఉపశమనంగా ఉపయోగపడుతుంది.
పెరిగిన అమ్మకాలు..
వర్షాకాలంలో వేడివేడి మొక్కజొన్న కంకులకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. పచ్చి మొక్కజొన్న కంటే కాల్చిన కంకులకు ధర ఎక్కువ ఉంటుంది. కాల్చిన కంకులు రూ.10 నుంచి రూ.20 వరకు ధర పలుకుతున్నాయి. పచ్చి కంకులు ధర రూ.5 నుంచి పలుకుతుండగా, డజన్లపరంగా కూడా అమ్ముతున్నారు. ప్రతిరోజు మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలంతో పాటు మెదక్ చుట్టూ గల మండలాల్లో నుంచే కాకుండా పక్కనే గల కామారెడ్డి జిల్లా నుంచి రైతులు మెదక్‌కు తీసుకొచ్చి అమ్ముతుంటారు.
కంకులు అందరికీ ఇష్టమే..
మొక్కజొన్న కంకులు తినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు. ముఖ్యంగా వర్షాలు పడే సమయంతో పాటు చల్లటి వాతావరణ సమయంలో వీటిని తినడానికి ముందుకొస్తారు. ఇటీవల కాలంలో మార్కెట్లో వీటిని ఇష్టంగా కొంటున్నారు.
పిండి పదార్థాలు 19 గ్రాములు
చక్కెర 3.2 గ్రాములు
పీచు పదార్థాలు 2.7 గ్రాములు
కొవ్వు పదార్థాలు 1.2 గ్రాములు
మాంస కృత్తులు 3.2 గ్రాములు
విటమిన్-ఏ 10 మైక్రో గ్రాములు
థయామిన్ (విటమిన్-బీ1) 0.2 గ్రాములు
నియాసిన్ (విటమిన్-బీ3) 1.7 మి. గ్రాములు
ఫోలేట్ (విటమిన్-బీ9) 46 మైక్రో గ్రాములు
విటమిన్-సీ 7 మి. గ్రాములు
ఇనుము 0.5 మి.గ్రాములు
మెగ్నీషియం 37 మి.గ్రాములు
పొటాషియం 2.70 మి.గ్రాములు