
పండుగలా పాఠశాలలు ప్రారంభం
మామిడి తోరణాలు, కొబ్బరిమట్టలు, బెలూన్లలతో ముస్తాబు
కరోనా నిబంధనలపై అవగాహన, వాల్ పోస్టర్ల ఏర్పాటు
మాస్క్ తప్పనిసరి, పాఠశాలల్లో శానిటైజర్ల ఏర్పాటు
చిన్నశంకరంపేట/నిజాంపేట/పాపచిలిపిచెడ్/నర్సాపూర్/వెల్దుర్తి/ చేగుంట/ సెప్టెంబర్ 01: మెదక్ మండల పరిధిలో వివిధ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు బుధవారం ప్రారంభం కావడంతో విద్యార్థులు తొలి రోజు ఉత్సాహంగా హాజరయ్యారు.అధికారులు ఉపాధ్యాయులు పాఠశాలలో కొవిడ్నిబంధనలకు అనుగుణంగా విధ్యార్థులకు థర్మల స్క్రీనింగ్ చేశారు. శానిటైజర్ అందుబాటులో ఉంచారు. కొల్చారం మండల వ్యాప్తంగా పాఠశాలల పున:ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో జరిగింది. పెద్దశంకరంపేట కమలాపురం గ్రామంలో విద్యార్థులకు మాస్క్‌లను పంపిణీ చేశారు. అన్ని పాఠశాలల్లో మామిడి తోరణాలతో, కొబ్బరి మట్టలతో పాఠశాలలను అందంగా అలంకరించారు. విద్యార్థులకు భూతికదూరం, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులు రసాయనాలను పిచికారీ చేశారు. మధ్యాహ్న భోజనాలను సైతం కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు వడ్డించారు.
పాఠశాల ప్రారంభమైన వేళా ఉపాధ్యాయులు, విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలకు హాజరు కావాలని మండల ప్రత్యేకాధికారి విజయలక్ష్మి అన్నారు. నిజాంపేట, నందిగామ గ్రామాల్లోని పాఠశాలలను సందర్శించి మాట్లాడారు.
పాపన్నపేట మండల పరిధిలోని వివిధ పాఠశాలలు ప్రారంభం కావడంతో.. కుర్తివాడ పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు. పాఠశాలల్లో స్వచ్ఛతా పక్షోత్సవాల్లో భాగంగా విద్యార్థులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు.
కరోనా నేపథ్యంలో పాఠశాలలు పున:ప్రారంభం అవుతున్న వేళ విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా మౌలిక సదుపాయాలను కల్పించాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. పల్వంచ ప్రాథమికోన్నత, ధనూర, టేక్మాల్ ఉన్నత పాఠశాలలను బుధవారం ఆమె తనిఖీ చేశారు.
పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని ట్రైనీ కలెక్టర్ అశ్వినీ వాంఖిడే అన్నారు. చేగుంట జిల్లా పరిషత్పాఠశాలను ఆమె సందర్శించారు. మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.