
తీపిని పంచుతున్న చెరుకు రైతుకు చేదు మిగులుతున్నది. రోజురోజుకూ పెట్టుబడులు పెరుగుతుండడం, పండించిన పంటకు తగిన మద్దతు ధర దక్కక నష్టపోతున్నాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం చెరుకు సాగుకు పెట్టింది పేరు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడే చెరుకు పంట పండిస్తున్నారు. కానీ, రెండేండ్లుగా ఇక్కడి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా పేరొందిన ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ గతేడాది నుంచి క్రషింగ్‌ను నిలిపివేయడంతో రైతులకు ఇబ్బందిగా మారింది. దీంతో కర్ణాటక, మహారాష్ట్ర, సంగారెడ్డి, కామారెడ్డి ప్రాంతంలోని ఫ్యాక్టరీలకు చెరుకును తరలిస్తున్నారు. తద్వారా రవాణా ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. కేంద్రం మద్దతు ధర కల్పించక పోవడంతో రైతులకు నష్టాలు మిగులుతున్నాయి. ఈ నవంబర్‌లో ట్రైడెంట్ పరిశ్రమలో క్రషింగ్‌ను ప్రారంభించేందుకు మంత్రి హరీశ్‌రావు చర్యలు చేపడుతున్నారు.
జహీరాబాద్, సెస్టెంబర్ 1: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో చెరుకు పంట సాగుచేస్తున్న రైతులకు రెండేండ్లుగా చేదు మిగులుతున్నది. రాష్ట్రంలో అత్యధికంగా చెరుకును జహీరాబాద్‌లో రైతులు సాగుచేస్తున్నారు. జహీరాబాద్ డివిజన్లోని జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ మండలాల్లో చెరుకు అధికంగా సాగుచేస్తున్నారు. ఒక్కసారి చెరుకు విత్తనం వేస్తే మూడు నుంచి ఐదేండ్ల వరకు పంట వస్తుంది. జహీరాబాద్ మండలం కొత్తూర్(బి) గ్రామంలోని ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ ఏడాదిగా చెరుకు క్రషింగ్‌ను నిలిపివేసింది. దీంతో స్థానిక రైతులకు ఇబ్బందిగా మారింది. స్థానికంగా షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్‌ను నిలిపివేయడంతో జహీరాబాద్ రైతులు చెరుకును కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలోని సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లోని ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. ఇది వారికి ఆర్థికంగా భారంగా మారింది.
జహీరాబాద్ డివిజన్లో గతేడాది కంటే ఈసారి చెరుకు సాగు పెరిగింది. చెరుకు సాగుకు అనుకూల వాతావరణం ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తుండడం, పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉండడంతో సాగు గణనీయంగా పెరిగింది. గతేడాది జహీరాబాద్ డివిజన్లో 6 వేల ఎకరాల్లో సాగుచేయగా, ఈసారి 15 వేల ఎకరాల్లో పండిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చెరుకు సాగుకు పెట్టుబడులు పెరిగాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఆశించిన మేర పెంచకపోవడంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు ఇటీవల ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ చైర్మన్ నందకుమార్‌తో సమావేశమై క్రషింగ్ ప్రారంభించేందుకు చర్చించారు. నవంబర్ 15 వరకు క్రషింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది.
రైతు ఎకరాలో చెరుకు పంట సాగుకు రూ.54,500 పెట్టుబడులు అవుతాయి. ఎకరాలో 35 నుంచి 40 టన్నుల చెరుకు దిగుబడి వస్తుంది. గతేడాది ప్రైవేటు పరిశ్రమల వారు టన్ను చెరుకు రూ.3 వేలు రైతులకు చెల్లించారు. ఈ లెక్కన ఎకరాకు రైతుకు రూ.1.20 లక్షల ఆదాయం వస్తుంది. ఏడాది పాటు రైతు చెరుకు పంట సాగుచేస్తే ఎకరాకు రూ.54,500 మాత్రమే ఆదాయం మిగులుతోంది. చెరుకు నరకడంతో పాటు పరిశ్రమకు తరలించే వరకు రైతు ఖర్చు భరించాలి. రవాణా ఖర్చులు రైతులే భరించడంతో భారంగా మారింది. తెలంగాణలో టన్ను చెరుకు సాగు చేసేందుకు రూ.4వేల ఖర్చవుతున్నదని చక్కెర శాఖ జాతీయ వ్యవసాయ వ్యయ ధర కమిషన్ (పీఏసీసీ)కి నివేదిక సమర్పించింది. రైతుకు చక్కెర పరిశ్రమల వారు టన్నుకు రూ.3,800 చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతుందని తెలిపింది. జాతీయ వ్యవసాయ వ్యయ ధర కమిషన్ నివేదికను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా మద్దతు ధరను ప్రకటించింది. 2021-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం చెరుకు కనీస కొనుగోలు ధర క్వింటాలుకు రూ.290 ప్రకటించింది. రైతులకు చెల్లించాల్సిన ప్రోత్సాహక ధర(ఎఫ్ఆర్పీ)ని క్వింటాలుకు రూ.5 చొప్పున పెంచి రూ.290గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) సమావేశంలో చెరుకు కొనుగోలు ధరను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. చెరుకు కనీస ధరను టన్నుకు రూ.4 వేలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
కర్ణాటక, మహారాష్ట్రలో చెరుకు పండించడం, నరకడం వరకే రైతు బాధ్యత. పొలం నుంచి చక్కెర పరిశ్రమకు తీసుకెళ్లేది పూర్తిగా పరిశ్రమల యాజమాన్యాలే అని రైతులు తెలుపుతున్నారు. దీంతో రవాణా ఖర్చుల భారం రైతుపై పడదు. ఈ సదుపాయం తెలంగాణలో లేదు. రైతు టన్ను చెరుకును పరిశ్రమకు తరలించేందుకు రూ.15 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తున్నది. దీంతో తమకు నష్టాలే మిగులుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పరిశ్రమల్లో రైతులకు ప్రోత్సాహక ధరతో పాటు చెరకు నరికే ఖర్చులు చెల్లిస్తున్నాయి.
ట్రైడెంట్ చక్కెర పరిశ్రమలో క్రషింగ్‌ను ప్రారంభించేందుకు మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ఆ ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించేందుకు, రైతులకు బకాయి పడ్డ డబ్బులు ఇప్పించేందుకు పరిశ్రమ యాజమాన్యంతో పలుమార్లు ఆయన సమావేశమై చర్చించారు. ఈ నవంబర్‌లో క్రషింగ్‌ను ప్రారంభించేలా మంత్రి కృషి చేస్తున్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌తో కలిసి హైదరాబాద్‌లో ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు జరిపారు. రైతులు, కార్మికులకు మేలు జరిగేలా చర్యలు చేపడుతున్నారు.
ట్రైడెంట్ చక్కెర పరిశ్రమల్లో చెరుకు క్రషింగ్‌కు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. గతేడాది క్రషింగ్ ప్రారంభించకపోవడంతో రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి, కామారెడ్డి ప్రాంతంలోని పరిశ్రమలకు చెరుకు తరలించింది. ఈ ఏడాది ట్రైడెంట్‌లో క్రషింగ్ ప్రారంభించేందుకు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ ట్రైడెంట్ యాజమాన్యంతో మాట్లాడారు. చెరుకు రైతులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుంది. – ఉమాకాంత్ పాటిల్, సీడీసీ చైర్మన్ జహీరాబాద్
భూమి దున్నడం, గొర్రు కొట్టడం – రూ.5,000
చెరుకు విత్తనం ఎకరానికి నాలుగు టన్నులు – రూ.12,000
సేంద్రియ ఎరువు, డీఏపీ, యూరియా – రూ.10,000
విద్యుత్ మోటర్లు, మరమ్మతు ఖర్చులు, పైపులకు – రూ.3,500
కలుపు తీసేందుకు – రూ.5,000
జుడి కట్టడం కోసం – రూ.4,000
చెరుకు నరకడం, క్రషింగ్ తరలింపు – రూ.15,000