మన ఊరి బడి దశ మారనున్నది. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. పోటీప్రపంచంలో నిలబడేలా విద్యార్థులను పాఠశాల స్థాయిలోనే తీర్చిదిద్దాలని నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధనను ప్రవేశపెట్టడంతోపాటు సదుపాయాలను మెరుగుపర్చేందుకు ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు అరకొర వసతులతో ప్రభుత్వ పాఠశాలలు కునారిల్లగా.. స్వరాష్ట్రంలో సర్కారుబడులకు ప్రాధాన్యత పెరిగింది. తాజాగా ‘మన ఊరు.. మన బడి’ అమలుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. ఇప్పటికే సుమారు ఏడువేల కోట్ల నిధుల్ని ఇందుకోసం ప్రభుత్వం కేటాయించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభమైతే బడి రూపురేఖలు మారడంతోపాటు విద్యార్థులకు మరింత నాణ్యమైన బోధన అందనున్నది.
నిజామాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాఠశాల స్థాయి నుంచే పోటీ వాతావరణాన్ని తట్టుకునేలా విద్యార్థులను తీర్చిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. విద్యార్థులు భవిష్యత్లో మంచి అవకాశాలను దక్కించుకునేందుకు ఇంగ్లిష్ మీడియం బోధన తప్పనిసరి అని భావించి ఆ దిశగా కృషి చేస్తున్నది. చదువుతోపాటు బడుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు రాష్ట్ర బడ్జెట్లో ఇందుకోసం నిధులు కేటాయించడంతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 40శాతం నిధులను వెచ్చించాలని నిర్ణయించడం శుభపరిణామం.
పైసా ఖర్చు లేకుండా..
ప్రైవేటులో చదువు కోసం రూ.వేలల్లో ఫీజులు కట్టాల్సిందే. అడ్మిషన్ కావాలంటే డొనేషన్ ఇచ్చుకోవాల్సిందే. ఆ తర్వాత పుస్తకాల, డ్రెస్సులు అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తారు. మధ్యలో పరీక్ష ఫీజులు, నిర్వహణ ఖర్చులని, బస్సు సర్వీస్ పొందితే ట్రాన్స్పోర్ట్ ఫీజులు ఇలా అనేక విధాలుగా పేదలు దోపిడీకి గురి కావాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ బడుల్లో పిల్లలకు ఉచితంగానే సేవలందుతాయి. నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనమూ అందుతుంది. క్రీడల్లోనూ విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహం ఉంటుంది. 99శాతం ప్రభుత్వ బడులకు క్రీడా మైదానాలు ఉన్నాయి.
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..
స్కూళ్లను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత విద్యా వ్యవస్థ గాడిలో పడింది. కొత్తగా సీఎం ప్రకటించిన పలు నిర్ణయాలు మరింతగా మేలు చేకూర్చబోతున్నాయి. ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు తరలి వచ్చే అవకాశాలుంటాయి. ఆదరణ తప్పక పెరుగుతుంది.
కార్పొరేట్ తరహా విద్య
ప్రైవేట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రాధాన్యత అంశంగా ఉన్న ఈ పరిస్థితుల్లో పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహా విద్యనందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన కొనసాగుతున్నది. విద్యార్థులు పోటీ వాతావరణాన్ని తట్టుకునేలా ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రతి పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాతృభాషకు అత్యంత విలువనిస్తూనే పిల్లలు పోటీ ప్రపంచంలో రాణించేలా ఇంగ్లిష్ మాధ్యమంలోనూ చదువు చెప్పించేందుకు సర్కారు ముందడుగు వేసింది. ఇందుకోసం ఆయా వర్గాల నుంచి వచ్చిన వినతులు… విద్యావేత్తలు, మేధావుల ఆలోచనలు, అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. పేదకుటుంబాలకు ప్రైవేటులో రూ.వేలు ఖర్చు చేసి చదువు చెప్పించే స్తోమత లేదు. అలాంటి వారికి సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఎంతో మేలు చేకూరనుంది. ఓ రకంగా సర్కారు బడులన్నీ కార్పొరేట్ తరహా విద్యను అందించబోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేసిన ప్రభుత్వం, స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియిమించింది. అవసరమైన చోట్ల విద్యావలంటీర్లను నియమించి బోధన కొనసాగిస్తున్నది.
ప్రభుత్వ స్కూళ్లకు కొత్తరూపు
సీఎం కేసీఆర్ నిర్ణయంతో సర్కారు స్కూళ్లకు మహర్దశ పట్టనుంది. వసతులను మెరుగుపర్చనుండడంతో బడులు తళుక్కున మెరువనున్నాయి. అవసరమైన చోట్ల అదనపు గదుల నిర్మాణానికి అవకాశాలున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 1,166 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఇందులో 1039 మండల ప్రజా పరిషత్, జిల్లా పరిషత్ స్కూళ్లు 117 ఉన్నాయి. ఆయా మండలాల్లో 10 ఆదర్శ పాఠశాలల్లోనూ పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. ఇవేకాకుండా 25 కేజీబీవీలున్నాయి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. పేద, మధ్య తరగతి వర్గాలకు భారీ స్థాయిలో ఊరటను కల్పించేందుకు కృషి చేస్తున్నది.
విద్యారంగం బలోపేతానికి కృషి
విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం నడుం బిగించి దశల వారీగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల అంటేనే ఆమడ దూరం పారిపోవాల్సిన పరిస్థితి ఉండేది. మౌలిక సదుపాయాలు అరకొరగా ఉండడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించేందుకు చాలా మంది వెళ్లేది కాదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సర్కారు బడులకు ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలను మెరుపర్చేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం రూ.వందల కోట్ల నిధులు మంజూరు చేశారు. ఏడేండ్లుగా విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నది. ఇప్పుడు ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం అమలు చేయాలనే విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోవడంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సకల సౌకర్యాలకు నెలవుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దడంతోపాటు వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనకు సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో ప్రభుత్వ బడులు మరింత బలోపేతం కాబోతున్నాయి. పేద విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందనున్నది.