మహబూబ్‌నగర్, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనమని చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం మొత్తాన్ని కొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని, రైతులను ఆదుకునేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే కార్యాచరణతో ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులను ఉద్దేశించి 2021- 22 యాసంగి వరి ధాన్యం కొనుగోలు పై ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యాసంగి ధాన్యం కొనేందుకు నిర్ణయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మహబూబ్ నగర్ జిల్లాలో 191 కొనుగోలు కేంద్రాలు, నారాయణపేట జిల్లాలో 109 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చూపొద్దని… నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న 15 రోజులు అధికారులు, ప్రజా ప్రతినిధులు 24గంటలూ కష్టపడి ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, రైతుల కోసం నీడ, కుర్చీలు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, తేమ కొలిచే యంత్రాలతో పాటు, ఇతర ఏర్పాట్లు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద వ్యవసాయ విస్తరణ అధికారి, రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు, వ్యవసాయ అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లను విధిగా ప్రదర్శించాలన్నారు. ధాన్యం కొనుగోలును ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఒక వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. సివిల్ సప్లయి మార్కెటింగ్, డీఆర్డీవో, మెప్మా శాఖల ద్వారా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. రైస్ మిల్లర్లు ముందుగానే సరిపడినన్ని గోదాములు గుర్తించి సిద్ధం చేసుకోవాలన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 10 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ రైతుల పాసుబుక్కులు వాడుకొని కర్ణాటకకు చెందిన కొంతమంది రైతులు ఇక్కడ విక్రయించేందుకు వస్తారని అధికారులు అప్రమత్తంగా ఉండాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సూచించారు. అందుకే ఏ రైతు ఎన్ని ఎకరాల్లో వరి పంట వేశారనే సమాచారం ఏఈవోలతో ఉండాలన్నారు. ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కర్ణాటక ధాన్యం తెలంగాణలోని కొనుగోలు కేంద్రాలకు రాకుండా చూడాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకండా అధికారులు జాగ్రత్త వహించాలన్నారు.
– ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
రైతుల సంక్షేమం సీఎం కేసీఆర్ ఎంతటి భారాన్నైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. అందుకే రూ. 3 నుంచి 4వేల కోట్ల భారమైనా భరించి యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు నిర్ణయించినందుకు పాలమూరు రైతుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర రైతులను అవమానించినా ముఖ్యమంత్రి అన్నదాతకు అండగా నిలిచారన్నారు. ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. గతంలో జరిగిన ఇబ్బందులు, సమస్యలు లేకుండా ఈసారి కొనుగోలు ప్రక్రియ సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాత గన్నీ బ్యాగులకు బదులుగా కొత్తవి ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో మహబూబ్ నగర్, నారాయణపేట కలెక్టర్లు ఎస్. వెంకట్ రావు, దాసరి హరిచందన, అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, పౌరసరఫరాల డీఎం జగదీశ్, డీఎస్వో వనజాత, డీఆర్డీఓ యాదయ్య, మార్కెటింగ్ ఏడీ సారిక, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, పీఏసీసీఎస్ చైర్మన్లు, రైతుబంధు మండలాధ్యక్షులు, ఇతర అదికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
– ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి