
అమరచింత, జనవరి 21 : ఈత నేర్చుకునేందుకు స్నేహితులతో కలిసి జూరాల ఎడుమ కాలువకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటి ఉధృతి పెరగడంతో కొట్టుకుపోతుండగా.. మత్స్యకారులు ఇద్దరిని కాపాడగా.. ఒకరు గల్లంతైన ఘటన వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామ సమీపంలో చోటు చేసుకున్నది. ఎస్సై పుట్ట
మహేశ్‌గౌడ్ కథనం మేరకు..
నందిమల్ల గ్రామానికి చెందిన టైలర్ రాజాకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ఆరీఫ్ (10) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. కొవిడ్ నేపథ్యంలో బడులకు సెలవులు ఉండడంతో శుక్రవారం ఉదయం తోటి స్నేహితులైన మౌలాలి, పాషాతో కలిసి ఈత నేర్చుకునేందుకు గ్రామ శివారులోని జూరాల ఎడుమ కాలువ వద్దకు ఆరీఫ్ వెళ్లాడు. ఈత నేర్చుకుంటున్న క్రమంలో కాలువలో నీటి ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో ముగ్గురు ప్రవాహం లో కొట్టుకుపోతుండగా.. సమీపంలో ఉన్న మత్స్యకారుడు కురుమూర్తి కాలువలోకి దూకాడు. మౌలాలి, పాషాను కాపాడగా.. ఆరీఫ్ గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని పోలీసులకు గ్రామస్తులు తెలిపారు. జూరాల ప్రాజెక్టు అధికారులకు పోలీసులు సమాచారం అందించగా నీటి విడుదలను తగ్గించారు. తర్వాత కాలువలో గాలించగా మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కిలో మీటర్ దూరం లో మృతదేహం లభ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్‌గౌడ్ తెలిపారు. మృతదేహానికి ఆత్మకూర్ ప్రభుత్వ దావఖానలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.