
మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 30 : మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం సమీపంలోని అప్పన్నపల్లి వద్ద దారుల్ఉలుమ్ ఖుద్దూస్ సబీల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ముస్లిం మైనార్టీ విద్యార్థులకు లాప్టాప్, వివిధ సామగ్రి అందజేయడంతోపాటు క్రికెట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని తెలిపారు. మైనార్టీ గురుకులాల ఏర్పాటు, ఇమామ్, మౌజన్లకు గౌరవవేతనం అందజేస్తున్నారని చెప్పారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఖబరుస్తాన్లకు 11 ఎకరాల భూమిని కేటాయించినట్లు స్పష్టం చేశారు. జిల్లా క్రీడాకారులు క్రికెట్లో రాణించాలని, బాక్స్ క్రికెట్ హైదరాబాద్, బెంగళూర్ వంటి నగరాల్లో ఆడుతారని చెప్పారు. మహబూబ్‌నగర్‌లో అకాడమీ అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు. ప్రతి క్రీడా అంశంలో జిల్లా క్రీడాకారులు రాణించాలని కాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నదని తెలిపారు. జిల్లాలో క్రీడామైదానాలు అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో బెంగళూర్‌కు చెందిన ప్రముఖ ధార్మికవేత్తలు మహ్మద్ తాహెర్ ఖాస్మీ, పీఎం ముంజిమిల్ అహ్మద్, సబీల్ట్రస్ట్ ఫౌండర్ మౌలానా నయీంకౌసర్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌హదీ, నగే, ముస్తాక్ష్రీద్ పాల్గొన్నారు.
సెక్యూలర్ సీఎం కేసీఆర్ రూ.50లక్షలతో దర్గా అభివృద్ది
సెక్యూలర్ సీఎం కేసీఆర్, అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వీ.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అబ్దుల్‌ఖాదర్ దర్గా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దర్గాలో చాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. రూ.50లక్షలతో అబ్దుల్‌ఖాదర్ దర్గా అభివృద్ధికి కృషి చేశామని, మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మహబూబ్‌నగర్ పట్టణాన్ని హైదరాబాద్ తరహా అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటిగణేశ్, దర్గా ముతావల్లి మహ్మద్ జమీర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్, కౌన్సిలర్లు రామ్‌లక్ష్మణ్, షేక్ఉమర్, నాయకులు అన్వర్‌పాషా, ఇసాక్, మోసీన్, నూరుల్‌హసన్, అంజద్, రషద్, ఖాజాపాషా, అన్వర్ పాషా, ఉస్మాన్, జాఫర్ పాషా, అబ్దుల్ ఖదీర్, అబ్దుల్ నసీర్, మహ్మద్ ఖాజా, హాజీపాషా పాల్గొన్నారు.
అబ్దుల్‌ఖాదర్‌షా దర్గా గంధోత్సవం
జిల్లా కేంద్రంలోని రాయిచూరు రోడ్డులో గల హజ్రత్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ షా సాహెబ్ రహెమాతుల్లా అలై దర్గా 83ఉర్సు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గంధోత్సవం నిర్వహించారు. ముత్తవల్లి షేక్ బడేసాబ్ ఇంటి నుంచి ఒంటెపై బయలుదేరిన గంధం ఊరేగింపు అశోక్‌టాకీస్ చౌరస్తా, ఎస్బీహెచ్ రోడ్డు, తూర్పుకమాన్, పోలీస్ క్లబ్ నుంచి వన్‌టౌన్ చౌరస్తా గుండా దర్గాకు తీసుకెళ్లారు. మగ్రిబ్నమాజ్ అనంతరం దర్గాలో చాదర్లు సమర్పించి ఫాతేహాలు అందజేశారు. ఈ ఉత్సవాల్లో రాయిచూర్, నారాయణపేట, హైదరాబాద్, గద్వాల నుంచి భక్తులు హాజరయ్యారు.