
కల్వకుర్తి రూరల్, అక్టోబర్ 3 : ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చోటు చేసుకున్నది. కల్వకుర్తి ఎస్సై మహేందర్ ఘటనకు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కల్వకుర్తి పట్టణానికి చెందిన సయ్యద్ మన్సూర్, భాస్కర్‌రెడ్డి, క్రాంతికుమార్‌రెడ్డి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నా పక్కా సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్సై మహేందర్, పోలీస్ సిబ్బంది దాడులు చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 2.5 లక్షలు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ బెట్టింగ్‌లో మరో పదిహేడు మంది ఉన్నట్లు తాము గుర్తించామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని ఎస్సై తెలిపారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. బెట్టింగ్, ఇతర వ్యసనాల వైపు యువత వెళ్లవద్దని ఆయన సూచించారు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో పీఎస్సై రుమేనా, పోలీసులు పాల్గొన్నారు.