
సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న హరిత నిధిపైనే ఎక్కడ చూసినా విస్తృతంగా చర్చ కొనసాగుతున్నది. ఇప్పటికే హరితహారంతో ఉమ్మడి జిల్లా పచ్చబడగా.. గ్రీన్ ఫండ్‌తో మరింత పచ్చదనం సంతరించుకోనున్నది. ఈ వానకాలంలో ఉమ్మడి జిల్లాలో 1,39,85,869 మొక్కలు నాటి 1,31,83,154 మొక్కలను సంరక్షించారు. భవిష్యత్ తరాల కోసం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కేంద్రం గుర్తించి నిధికి పన్ను మినహాయింపు ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు ఈ కార్యక్రమాన్నిపెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. వివిధ ఫ్యాక్టరీలు, కంపెనీలు, సంస్థలు, వ్యక్తులు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా నిధులు
కేటాయించాలనే భావన వ్యక్తమవుతున్నది. ఇకపై పాఠశాలల్లో విద్యార్థులు సైతం మరింత చురుకైన పాత్ర పోషించే అవకాశం ఉన్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మహబూబ్‌నగర్ అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి): హరితహారం ద్వారా ఇప్పటికే హరిత తెలంగాణ చేసిన సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న హరితనిధి కార్యక్రమంపై ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. కలెక్టర్ నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు, ఉపాధ్యాయుల నుంచి విద్యార్థుల వరకు, ఎమ్మెల్యే నుంచి సర్పంచ్ వరకు, పీహెచ్డీ విద్యార్థి నుంచి స్కూల్‌కు వెళ్లే చిన్నారుల వరకు ప్రతిఒక్కరూ హరిత నిధిపైనే చర్చిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో హరితహారం కరువుఛాయలను పారదోలిన ప్రభుత్వం హరితనిధి ద్వారా మరింత పచ్చదనం పెంచేందుకు, భవిష్యత్‌లో కరువు అనే పదానికి అర్థం లేకుండా చేసేందుకు కృషి చేస్తోందని పేర్కొంటున్నారు. భవిష్యత్ తరాల కోసం ఈ కార్యక్రమాన్ని కేంద్రం గుర్తించి హరితనిధికి పన్ను మినహాయింపులు ఇవ్వాలని కూడా సూచిస్తున్నారు. జిల్లా వనరులను వినియోగించుకుని అభివృద్ధి చెందుతున్న వివిధ ఫ్యాక్టరీలు, కంపెనీలు, సంస్థలు, వ్యక్తులు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా హరితనిధికి నిధులు కేటాయించాలనే భావనా వ్యక్తం అవుతున్నది.
గతేడాది రికార్డు స్థాయిలో..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో హరితహారంలో భాగంగా గతేడాది వానకాలంలో నాటిన మొక్కలను సంరక్షించడంలో హరిత విజయం సాధ్యమైంది. 5 జిల్లాల్లో కలిపి 1,39,85,869 మొక్కలు నాటగా 1,31,83,154 మొక్కలను సంరక్షించారు. అత్యధికంగా నారాయణపేట జిల్లాలో 95.59శాతం మొక్కలను సంరక్షించగా.. జోగుళాంబ గద్వాల జిల్లాలో 92.44 శాతం సంరక్షించారు. 5జిల్లాల్లోనూ 90శాతానికి పైగా మొక్కలను కాపాడటం రికార్డు. హరిత నిధితో ప్రజల భాగస్వామ్యం పెరిగి హరితహారం మరింతగా విజయవంతం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు.
హరితనిధి అందరి బాధ్యత
హరితనిధి ఆలోచనే చాలా గొప్పది. ప్రభుత్వ కార్యక్రమం అంటే ప్రజాప్రతినిధులు, అధికారులకే పరిమితం అనేలా కాకుండా హరితనిధి ద్వారా పచ్చదనం పెంపులో ప్రతిఒక్కరి బాధ్యత ఉంటుంది. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు, సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు, ఒకటో తరగతి నుంచి నుంచి పీజీ చదివే విద్యార్థి వరకు ప్రతిఒక్కరూ తమవంతు పాత్ర పోషించనున్నారు. వారితోపాటు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకురావాలి.
అవగాహన కల్పిస్తాం
హరితహారం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం భారీగా పెరుగుతున్నది. ఓ ఉద్యోగిగా నా వంతు పాత్ర పోషించి హరితనిధికి నిధులు వచ్చేలా ప్రయత్నం చేస్తాను. ప్రజలకు సైతం హరితనిధి వివరించి ఇందులో మమేకమయ్యేలా కృషిచేస్తాం. స్వచ్ఛంద సంస్థలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనేలా వారిని ప్రోత్సహిస్తాం. హరితనిధి అనే ఆలోచనపై ప్రజల్లో పెద్దఎత్తున చర్చ జరిగేలా టీఎన్జీవో తరఫున మా వంతు ప్రయత్నం చేస్తాం.
ఆలోచన చాలా గొప్పది
ఎక్కడైతే కాలుష్యంస్థాయి తక్కువగా ఉంటుందో అక్కడ రోగాల శాతం కూడా తక్కువ. లేహ్ (జమ్ము కాశ్మీర్)లోని ఓ ప్రాంతంలో సగటు ఆయు ప్రమాణం వందేళ్లకు పైగా అని తేలింది. మనం కూడా మన పరిసరాలు పచ్చగా, శుభ్రంగా ఉండేలా చేసుకుంటే జీవించినన్ని రోజులు, రోగాలు దరిచేరకుండా ఉండవచ్చు. పచ్చదనం పెంపుపై సీఎం కేసీఆర్ తీసుకుంటున్న జాగ్రత్తలను టీజీవో తరఫున ఆహ్వానిస్తూ వారికి అభినందనలు తెలుపుతున్నాం.