
భువన్ సర్వే చురుకుగా సాగుతున్నది. భవనాల వివరాలను ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ సాయంతో ఇంటి విస్తీర్ణం, కొలతలు ఇతర వివరాలు సరిచూసి భువన్ యాప్‌లో పొందు పర్చుతున్నారు. బల్దియాల్లోని ఇండ్లు, వ్యాపార సంస్థలను పూర్తి స్థాయిలో కొలిచి ఫొటోలను తీసుకొని వాటికి సంబంధించిన సమగ్ర సమాచారం అంతా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ వివరాల నమోదుతో పాటు రెండేండ్ల కిందట ఇండ్లకు సంబంధించిన ఫొటోలను మున్సిపల్ రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. భవిష్యత్తులో యజమాని తన ఆస్తుల వివరాలను ఎక్కడి నుంచైనా సులువుగా చూసుకునేలా చర్యలు చేపట్టారు.
మహబూబ్‌నగర్‌టౌన్, అక్టోబర్ 3: మహబూబ్‌నగర్ జిల్లాలో భువన్ సర్వే చరుగ్గా సాగుతున్నది. భవనాల వివరాలను ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ సాయంతో భువన్‌యాప్‌లో పొందుపరుస్తున్నారు. భవిష్యత్తులో యజమాని తన ఆస్తుల వివరాలను ఎక్కడి నుంచైనా సులువుగా చెక్ చేసుకునేందుకు వీలుగా భువన్‌యాప్‌లో పొందుపరుస్తున్నారు. మున్సిపాలిటీల్లో ఇండ్లు, వ్యాపార సంస్థలకు సంబంధించిన సమగ్ర సమాచారం అంతా ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నారు. వివరాల నమోదుతో పాటు రెండేండ్ల కిందట ఇండ్లకు సంబంధించిన ఫొటోలను మున్సిపాలిటీలో రికార్డులో పొందుపర్చగా..ఈ రెండింటినీ అనుసంధానం చేస్తున్నారు. సమగ్ర సమాచారం సేకరించి యాప్‌లో నమోదు చేసేందుకు రెవెన్యూ, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు చేపట్టిన ఇంటింటి సర్వే చురుగ్గా కొనసాగుతున్నది. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో పరిధిలో 43,802 భవనాలున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇప్పటికి వరకు 30,152 ఇండ్ల సర్వే పూర్తి చేశారు. 69శాతం సర్వే పనులు పూర్తి కాగా ఇంకా13,650 చేయాల్సి ఉంది.
అనుమతులు, నిర్మాణాల్లో భారీ తేడాలు..
మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూర్ పట్టణాల్లో భవన నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయి. పాత ఇండ్ల స్థానాల్లో కొత్త కట్టడాలు వెలుస్తున్నాయి. గ్రామాలు సైతం ప్రస్తుతం పట్టణీకరణ దిశగా పరుగులు తీస్తున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మున్సిపాలిటీల్లో ప్రస్తుతం లేకపోవడంతో స్వీయ ముదింపునకు సెల్ఫ్ అసెస్మెంట్కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సర్కారు ఇచ్చిన ఈ అవకాశాన్ని పట్టణవాసులు ఉపయోగించుకోలేదు. దీంతో పురపాలికల్లో భారీగా ఆస్తిపన్ను నష్టాపోవాల్సి వస్తుందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2016లోనే భువన్‌యాప్ ద్వారా ప్రత్యేక సర్వేను చేపట్టి అమలు చేసింది. రాష్ట్రంలోని వివిధ పురపాలికల్లో చేపట్టిన భువన్ సర్వేతో ఆదాయం పెరగడంతో అంతటా భువన్ సర్వే చేపట్టాని నిర్ణయించి అమలు చేస్తున్నారు. ఆస్తి పన్ను ఎగ్గొడుతున్న భవన యజమానులకు భవన్ యాప్‌తో అడ్డుకట్ట పడునున్నది. మరోవైపు అక్రమాలకు తావు లేకుండా పక్కాగా ఆస్తి పన్ను మదింపు జరుగుతుండడం విశేషం.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సర్వే..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భువన్సర్వే కొనసాగుతున్నది. కొద్ది రోజుల్లోనే మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో నివాసాలు, వాణిజ్య సముదాయల వివరాల సేకరణ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే 67 శాతం సర్వే పూర్తి చేశాం. త్వరలోనే మిగిలింది భువన్‌యాప్‌లో నమోదు చేస్తాం.
వనపర్తి, అక్టోబర్ 3: ప్రతి మున్సిపాలిటీ పరిధిలోని ఇండ్లకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు జియో ట్యాగింగ్ కోసం రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ శాఖ భువన్ యాప్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటిని, ఖాళీ స్థలాలను పూర్తి స్థాయిలో సర్వే చేస్తారు. ప్రత్యేక టీంలు సర్వే చేసి ఫొటోలను యాప్‌లో పొందు పరుస్తారు. వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీ పరిధిలో (వనపర్తి, ఆత్మకూర్, అమరచింత, కొత్తకోట, పెబ్బేర్) మున్సిపల్ శాఖ చేపట్టిన భువన్ యాప్ సర్వేను జూలై 10 నుంచి ప్రారంభించారు. 5మున్సిపాలిటీల్లో మొత్తం 34,075 ఇండ్లకుగానూ 13,805 ఇండ్లను పూర్తి చేసి యాప్‌లో పొందుపరిచారు. మిగిలిన 20,270 ఇండ్లను నెలాఖరు వరకు పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.
యాప్‌లో పొందు పర్చే అంశాలు
మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికీ సంబంధించి ఎంత విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టారు..ఎన్ని అంతస్థులు, ఖాళీ స్థలం ఎంత ఉన్నది వంటివి కొలతలు చేయడంతో పాటు ఫొటోను భువన్ యాప్‌లో అప్లోడ్ చేస్తారు. ఇల్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారా, గృహ అవసరాల కోసమే వినియోగిస్తున్నారా లేదా రెండు ఉన్నాయా తదితర అంశాలను సైతం యాప్‌లో పొందుపరుస్తారు. జీపీఎస్‌లో లొకేషన్‌ను షేర్ చేసి, జియో ట్యాగింగ్ ద్వారా భువన్ యాప్‌లో సంబంధిత ఇంటి నెంబర్‌ను టైప్ చేస్తే పూర్తి వివరాలు అందులో తెలిసేలా యాప్‌ను రూపొందించారు.
నెలాఖరు వరకు పూర్తి చేస్తాం
జూలై 10 నుంచివనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక టీంల ద్వారా భువన్ యాప్ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి ఇంటినీ, ఖాళీ స్థలాన్ని పూర్తి స్థాయిలో కొలిచి జియో ట్యాగింగ్ చేస్తున్నాం. ఈనెలాఖరు వరకు 100శాతం సర్వేను పూర్తి చేస్తాం.