ధర్మపురి, ఏప్రిల్ 21: మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, స్వశక్తి మహిళలకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం ధర్మపురి నియోజకవర్గానికి చెందిన 200మంది స్వశక్తి సంఘాల మహిళలతో కలిసి మేడ్చల్‌లోని మమత ఇండస్ట్రీ, జీడిమెట్ల, సుభాష్‌నగర్‌లోని మినీ ఇండస్ట్రీలను మంత్రి సందర్శించారు.
ఆయా చోట్ల తయారవుతున్న వస్తువులు, సరుకులు, ఉత్పత్తుల ప్యాకింగ్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం జీడిమెట్ల ఉద్యానవన శాఖ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. నియోజకవర్గానికి చెందిన స్వశక్తి మహిళలు ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ, కార్పొరేషన్ ప్రోత్సాహంతో ‘సహజ’ బ్రాండ్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఈ బ్రాండ్ ద్వారా ఇప్పటికే సబ్బులు, నూనె మార్కెట్లోకి విడుదల చేశామని గుర్తుచేశారు.
రానున్న రోజుల్లో 100రకాల నిత్యావసర వస్తువులను మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. సూపర్ ఫైన్‌రైస్ కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడకుండా జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని రైతులు పండించే వడ్లను సేకరించి, మిల్లింగ్ చేయించి మార్కెట్లో విక్రయించాలని స్వశక్తి సంఘాల మహిళలకు సూచించారు. అలాగే మిర్చి, కందులు, పసుపు, పెసర్లు, చింతపండు తదితర నిత్యావసరాలను సేకరించి, మార్కెట్లో విక్రయించి లాభాలు గడించాలన్నారు.
రానున్న రోజుల్లో షాపులు, గోదాములు కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నాణ్యమైన సరుకులు, ఉత్పత్తులు, వస్తువులను అందించడం ద్వారా సహజ బ్రాండ్ విజయాలు సాధిస్తుందని, అద్భుతాలు సృష్టిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో వనరులకు ఏమాత్రం కొరత లేదని, పుష్కలంగా నీళ్లు, నిధులు, 24గంటల విద్యుత్ సరఫరా ఉన్నాయని గుర్తు చేశారు.
మరో వైపు ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. అవకాశాలను ప్రతి మహిళా వినియోగించుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. సమావేశంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జాయింట్ డైరెక్టర్ లియాఖత్ అహ్మద్, జగిత్యాల, పెద్దపల్లి డీఆర్డీవోలు వినోద్, శ్రీధర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ, శ్రీయోగి ఇండస్ట్రీస్ యజమాని వంశీ తదితరులు పాల్గొన్నారు.