సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్‌రావు ఆదర్శ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో నిరుపేద యువత కోసం ఉచిత శిక్షణ ఇవ్వాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా మండల కేంద్రంలో ‘మంత్రి కేటీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్’ పేరిట కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. అందులో ఉచిత శిక్షణతోపాటు మధ్యాహ్నం భోజనం పెట్టి, స్టడీ మెటీరియల్ కూడా అందించనుండగా, గురువారం ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. నేటి నుంచే తరగతులు మొదలు కాబోతుండగా, నిరుద్యోగులు సంబురపడుతున్నారు.
సిరిసిల్ల/ముస్తాబాద్, ఏప్రిల్ 21: ‘మీరు ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన శిక్షణను ఉచితంగా అందిస్తాం.. ఎంతైనా ఖర్చుపెడతాం.. మీరు మాత్రం ఉద్యోగాలు సాధించి మీ తల్లిదండ్రుల కల నెరవేర్చండి’ అంటూ ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్‌రావు ఆదర్శ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు విడుదల చేయనుండగా, గ్రూప్-2, గ్రూప్-4, వీఆర్వో, కానిస్టేబుల్‌తో పాటు వివిధ ఉద్యోగ పరీక్షలకు శిక్షణ ఇచ్చేలా హైదరాబాద్ కోచింగ్ సెంటర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో సెంటర్ ఏర్పాటు చేశారు. అమాత్యుడు కేటీఆర్‌పై ఉన్న అభిమానంతో ‘కేటీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్’గా నామకరణం చేశారు.
తొలుత కానిస్టేబుల్ పోస్టుల నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే రన్నింగ్, ఇతర ఈవెంట్స్‌కు అభ్యర్థులను సన్నద్ధం చేసేందుకు స్థానిక పులికుంట చెరువు మైదానాన్ని సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన ట్రైనీలను కూడా పోలీస్ శాఖ సహకారంతో రెడీగా ఉంచారు.
యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా దేశ చరిత్రలో తొలిసారి భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేయబోతున్నామనే సీఎం కేసీఆర్ ప్రకటనతో యువత ఆనందోత్సవంలో ఉన్నారు. ఆర్థికంగా లేక.. శిక్షణ తీసుకోలేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు చేయూత నివ్వాలనే ఉద్దేశంతో సొంత ఖర్చులతో శిక్షణ ఇప్పించేందుకు ముందుకు వచ్చిన. ఇందుకు అందరి సహకారం లభించడం ఆనందంగా ఉంది.
– జనగామ శరత్‌రావు, ఎంపీపీ ముస్తాబాద్
మాది బందనకల్. నేను డిగ్రీ పూర్తిచేశా. ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సన్నాహాలు చేయడం సంతోషంగా ఉంది. ముస్తాబాద్‌లో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అదృష్టం. మాలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రైవేట్‌లో శిక్షణ తీసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుండె. కానీ ఇక్కడ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నరు. కష్టపడి చదివి ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉంది.
– చిగురు మహేందర్, బంధనకల్
ముస్తాబాద్‌లో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. మహిళా అభ్యర్థులకు ఎంతో ప్రయోజనకంగా ఉంటుంది. ఎక్కడికో దూరం వెళ్లి వేలకువేలు ఖర్చు పెట్టి ట్రైనింగ్ తీసుకోవాల్సిన బాధ తప్పింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగం సాధిస్తా. నిర్వాహకులు, పోలీసులకు కృతజ్ఞతలు.
– ఇల్లందుల దీక్షిత. మద్దికుంట
హైదరాబాద్‌లో పేరెన్నికగన్న కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇచ్చే నిష్ణాతులైన ఫ్యాకల్టీతో ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణకాలంలో, శిక్షణ పూర్తయిన తర్వాత సబ్జెక్ట్‌లలో వచ్చే సందేహాలను సైతం నివృత్తి చేయనున్నారు. అలాగే అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను ఇవ్వనున్నారు. అలాగే వివిధ గ్రామాల నుంచే అభ్యర్థులకు ఉదయం అల్పాహారంతోపాటు భోజనం, మంచి నీరు ఇవ్వాలని నిర్ణయించారు.
ఉచిత కోచింగ్ సెంటర్‌తో ఒక్క ముస్తాబాద్ మండలమే కాదు ఇరుగు పొరుగు మండలాలైన సిద్దిపేట జిల్లాలోని విద్యార్థులకు ప్రయోజనం కలుగనున్నది. అంతే కాకుండా జిల్లా సరిహద్దులో గ్రామాల నిరుద్యోగ విద్యార్థులు శిక్షణకు ఆసక్తి చూపుతున్నారు.
ముస్తాబాద్‌లో రెండేండ్ల కిందే జనగామ శరత్‌రావు దాదాపు రూ.10లక్షల సొంత ఖర్చులతో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. వివిధ మండలాల అభ్యర్థులు 450 మందికి శిక్షణ ఇప్పించగా, అందులో 26 మంది కానిస్టేబుల్, పంచాయతీ సెక్రటరీ, వీఆర్వోలుగా ఉద్యోగాలు సాధించారు. అయితే అపుడు ఉద్యోగాలు సాధించినవారు ఇప్పుడు ఏర్పాటు చేసిన సెంటర్లో శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
నేను ఉద్యోగం సాధించేందుకు చాలా కష్టపడ్డా. ఆ కాలంలో శిక్షణ కేంద్రాలు ఉండేవి కావు. పెద్ద పెద్ద పట్టణాల్లో కేంద్రాలున్నా చాలా ఖర్చు పెట్టనిదే ట్రైనింగ్ సాధ్యమయ్యేది కాదు. నిరుద్యోగుల కోసం ప్రభుత్వం మంచి ఆవకాశం కల్పించింది. మీ దగ్గర్లోనే శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మంచి ఫ్యాకల్టీతో శిక్షణ ఇస్తున్నది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నాలుగు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ముస్తాబాద్లోనూ మొన్నటిదాకా ట్రైనింగ్ ఇచ్చాం. ఇప్పుడు శిక్షణ ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు, దాతలు ముందుకు రావడం అభినందనీయం. పోలీసు శాఖ ద్వారా నిరుద్యోగులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం.
– ఉపేందర్, సీఐ, సిరిసిల్ల రూరల్