సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 21: ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు చేరువ కావడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ‘పోలీస్ నేస్తం’ పేరిట వినూ త్న కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ఈ మేరకు గురువారం ఎల్లారెడ్డిపేట మండలంలో ని వెంకటాపూర్‌లో ఎస్పీ రాహుల్‌హెగ్డే ప్రారంభించారు. ప్రజలతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. నేటి నుంచి జిల్లా పరిధిలోని అన్ని ఠాణాల్లో లాంఛనంగా ప్రారంభిస్తారు.
ప్రజలకు భద్రత కల్పించే ఉద్దేశంతో ఇప్పటికే ప్రతి సోమవారం పోలీస్ దర్బార్ నిర్వహిస్తున్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని పోలీస్ నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి నుంచి 15రోజులపాటు నిత్యం పోలీసులు ఒక్కో గ్రా మంలో సమావేశాలు నిర్వహిస్తారు. వారితో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు. తమ పరిధిలోని సమస్యలు పరిష్కరించడంతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తారు. శాంతిభద్రతలపై అవగాహన కల్పిస్తారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కలిగే అనర్థాలు, వ్యసనాలు, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనపై యువతను చైతన్యవంతులను చేస్తారు. షీటీంల పనితీరు, సైబర్ నేరాలపై వివరించనున్నారు. ప్రజ ల సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేస్తారు.
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. పాత కేసులు, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. సైబర్ మోసాలపై అప్రమత్తం చేస్తాం. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. పోలీస్ నేస్తంలో ప్రజలు భాగస్వాములైనప్పుడే కార్యక్రమం విజయవంతమవుతున్నది.
– రాహుల్ హెగ్డే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల