ధాన్యం కొనుగోళ్లు, ఎఫ్‌సీఐకి బియ్యం అందించే విషయాలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎలాంటి అవగాహన లేకుండా తప్పుడు సమాచారంతో అవినీతి జరిగిందన్నట్లుగా మాట్లాడుతున్నారు. అసలు ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసి, మిల్లర్స్ ద్వారా బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అందించిన తర్వాతే కేంద్రం పాత్ర వస్తుంది. ఇవేమీ తెలియకుండానే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రైస్‌మిల్లుల్లో ధాన్యం మాయమైందంటూ మాట్లాడడం పద్ధతి కాదు. ఢిల్లీ వేదికగా రాష్ర్టాన్ని, ఇక్కడి ప్రజలను అవమానపర్చేలా మాట్లాడడమే కాకుండా తెలంగాణపై విషంగక్కుతున్నారు.
– విలేకరుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, ఏప్రిల్ 21( నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కార్పొరేషన్ : బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉన్న కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మేలా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, వ్యాపారుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసేలా ఢిల్లీ వేదికగా విషం కక్కుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల ఓట్లతో గెలిచి, కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన తెలంగాణ ప్రజల్ని అవమానించేలా మాట్లాడడం సరికాదని హితవుపలికారు.
ఎఫ్‌సీఐ, సివిల్ సప్లయ్ విషయాలపై అవగాహన లేకుం డా అబద్ధాలు మాట్లాడారని దుయ్యబట్టారు. గురువారం కరీంనగర్‌లోని మీ సేవ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎఫ్‌సీఐకి సంబంధించిన ధాన్యం రైస్‌మిల్లుల్లో మాయమైందని చెబుతున్న కిషన్‌రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ‘రైస్‌మిల్లుల్లో ఉన్న ధాన్యానికి మీరు డబ్బులిచ్చారా?, కేంద్రం డబ్బులు ఇచ్చిందా?’ అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీతో రుణం తీసుకొని మద్దతు ధరకు రైతుల నుంచి రాష్ట్ర ప్రభు త్వం ద్వారా పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యా న్ని మిల్లుల్లో పట్టించి బియ్యం చేసిన తర్వాత ఎఫ్‌సీఐకి అందిస్తామని పేర్కొన్నారు. కనీసం వీటిపై అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు.
వడ్లను బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి ఇచ్చాకే వాటికి సరిపడా డబ్బుల్ని నాలుగు నెలల తర్వాత ఎఫ్‌సీఐ ప్రభుత్వానికి ఇస్తుందని గుర్తు చేశారు. 2021 యాసంగి, వానకాలం కలిపి రాష్ట్రంలో 40 కోట్ల 50 లక్షల బస్తాలను సేకరించామని తెలిపారు. ఇందులో కిషన్‌రెడ్డి చెబుతున్న 4,53,000 బస్తాలు 0.0001 శాతం అని పేర్కొన్నారు. అది కూడా పూర్తిగా తప్పుడు సమాచారమేనని పేర్కొన్నారు. మిల్లుల్లో కొన్ని చోట్ల బ్యాగులు చినిగి వడ్లు కింద పడ్డ వాటిని ఎఫ్‌సీఐ లెకించదని తెలిపారు. కింద పడ్డ వడ్లు ఎక్కడికీ పోవు అని పేర్కొన్నారు. రైస్ మిల్లుల్లో ఉన్నప్పుడు అవి రాష్ట్ర ప్రభుత్వ ధాన్యమేనని, బియ్యంగా మారి ఎఫ్‌సీఐ గోదాముల్లోకి వెళ్లినప్పుడే అవి కేంద్రానికి చెందుతాయని పేర్కొన్నా రు.
ఎకడైనా కొందరు మిల్లర్లు డిఫాల్ట్ ఐతే రాష్ట్ర ప్రభుత్వం వారి నుంచి ముకుపిండి వ సూలు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించి చట్టాలను పటిష్టంగా అ మలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభు త్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో ఒక వడ్లగింజను సైతం వదిలేది లేదని స్పష్టం చేశారు. 2,794 రైస్ మిల్లుల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఆర్ఆర్ రికవరీ యాక్ట్ ద్వారా రికవరీ చేస్తామని తెలిపారు. ఈసారి కొనుగోళ్ల కోసం 40 కోట్ల 50 లక్షల గన్నీ బ్యాగుల్లో 4 లక్షల గన్నీ బ్యాగులు కూడా లేవని కిషన్‌రెడ్డి అబద్ధాల కథలే చెబుతున్నారని, అయితే ఇప్పటికే తమ వద్ద 3.57 కోట్ల గన్నీ బ్యాగులు ఉన్నాయని మంత్రి గంగుల పేర్కొన్నారు.
వచ్చి చెక్ చేసుకోవచ్చునని, 3 కోట్ల గన్నీ బ్యాగులు ఉంటే మీరు వచ్చి మోస్తారా? అని నిలదీశారు. కేంద్ర జ్యూట్ శాఖ నుంచి రాష్ర్టానికి 8 కోట్ల గన్నీ బ్యాగులు కావాలని అడిగితే ఇప్పటికీ 4.45 కోట్ల బ్యాగులు మాత్రమే ఇచ్చిందన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఎప్పుడైనా పూర్తిస్థాయిలో తెలంగాణకు గన్నీ బ్యాగులు అందించాలని ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. నిజంగా కిషన్‌రెడ్డికి తెలంగాణపై ప్రేమ ఉంటే వెంటనే డిమాండ్ మేరకు గన్నీ బ్యాగులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో పశ్చిమబెంగాల్ నుంచి గన్నీ బ్యాగులు తెచ్చుకున్నప్పుడు ఆయన ఎక్కడికి పోయారని ప్రశ్నించారు.
తెలంగాణ రైతులు భారతదేశంలో అంతర్భాగం కాదా? అని, ఏం తప్పు చేశారని వేధిస్తున్నారని మండిపడ్డారు. గన్నీ బ్యాగులు తక్కువ చేసి తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ప్రయత్నించడం నీచ సంస్కృతికి నిదర్శనమని విమర్శించారు. యాసంగిలో వచ్చే ధాన్యంలో కొన్ని జిల్లాల్లో నూక శాతం అధికంగా ఉంటుందని, కనీసం వాటి దగ్గరైనా బాయిల్డ్ రైస్ 10 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకునేలా కిషన్‌రెడ్డి కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
2021-22 వానకాలం సీజన్లో 70.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, కానీ, కేంద్రం 68.66 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సమానమైన 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి మాత్రమే అనుమతి ఇచ్చిందన్నారు. ఈ మిల్లింగ్ ప్రక్రియకు పలు పేర్లతో కొర్రీలు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నది వాస్తవం కాదా? అని నిలదీశారు. గత యాసంగిలో ఏప్రిల్ 17 నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే 624 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, 104 కొనుగోలు కేంద్రాల ద్వారా 11,543 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నామని చెప్పారు.
సీఎస్ కమిటీ నూక శాతాన్ని పరిశీలన చేస్తుందని, ఏ జిల్లాలో ఎంత నూక శాతం వస్తుందో ఆ ప్రకారం చర్యలు తీసుకునేలా ఎఫ్‌సీఐని ఒప్పించే బాధ్యత కిషన్‌రెడ్డి తీసుకుంటారా? అని సవాల్ విసిరారు. రాష్ట్రం నుంచి ప్రతి నెలా 9 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, కనీసం 3 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ఎఫ్‌సీఐ తీసుకోవడం లేదన్నారు.
బియ్యం అందించే విషయంలో ఎఫ్‌సీఐకి 16 లేఖలు రాశామని, కానీ వాటికి ఎలాంటి సమాధానాలు రాలేదన్నారు. ఈ యాసంగిలో 1,41,853 టార్పాలిన్లు, 10,632 వేయింగ్ మిషన్లు, 8350 మాయిశ్చర్ మీటర్లు, 5085 ప్యాడీ క్లీనర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఒక రైతు అయినా గన్నీబ్యాగులు, మాయిశ్చర్ మిషన్లు, వేయింగ్ మిషన్లు లేవని రోడ్డు మీదికొచ్చారా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో కూర్చొని తప్పుడు సమాచారంతో మాట్లాడడం కాదని, స్వయంగా వచ్చి చూస్తే తెలుస్తుందని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ప్రొక్యూర్మెంట్ విషయంలో తనిఖీలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు. మండుటెండల్లో రాష్ట్ర రైతాంగం కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంటే బురద చల్లే పని బీజేపీ చేస్తున్నదని దుయ్యబట్టారు. వడ్లకు మద్దతు ధర పెట్టి కొంటున్నది రాష్ట్ర ప్రభుత్వమేనని, ఇందులో కేంద్రం పైసలెకడివని ప్రశ్నించారు. నూక ఎకువైతే కేంద్రం ఏమైనా ఇస్తుందా? అని నిలదీశారు.
ఎఫ్‌సీఐ ప్రారంభమైనప్పటి నుంచి చేపడుతున్నట్లుగా కొనుగోలు ఇప్పుడు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, నాయకులు చల్ల హరిశంకర్, బండారి వేణు తదితరులు పాల్గొన్నారు.