వారంతా మొన్నటిదాకా మూస సాగు విధానాలే పాటించారు. లాభం వస్తే తీసుకున్నరు.. లేదంటే నష్టపోయారు. ఇలా దశాబ్దాలుగా అరిగోసపడ్డారు. కానీ రాష్ట్ర సర్కారు పంట మార్పిడికి పిలుపునివ్వడంతో ఆ దిశగా కదిలారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనల మేరకు వరికి బదులుగా తెల్లజొన్నను పండిస్తూ సరికొత్తగా ముందుకుసాగుతున్నారు మంథని మండలంలోని రైతులు. నేడో రేపో కోతలకు సిద్ధమవుతూనే.. దండిగా కాసిన చేనును చూసి సంబురపడుతున్నారు.
– పెద్దపల్లి ఏప్రిల్ 17( నమస్తే తెలంగాణ)
తెల్లజొన్నకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. మన పూర్వీకులు అంబలి, జొన్నరొట్టెను ఎక్కువగా తిని ఆరోగ్యంగా జీవించేవారు. రానురాను తెల్లజొన్నను పూర్తిగా వదిలేయగా, కొవిడ్ తర్వాత మారిన ప్రజల ఆహారపు అలవాట్లలో తృణధాన్యాలకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. మళ్లీ తెల్లజొన్న ఆహారంలో భాగమైపోయింది. కాగా, జొన్న సాగు చేసిన రైతులకు మంచి గిట్టుబాటు ధరే ఉంది. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు దాదాపుగా 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. తక్కువలో తక్కువ 15 నుంచి 20 క్వింటాళ్లు మాత్రం ఎటూపోవు. మర్కెట్లో క్వింటాల్ జొన్న ధర 5వేల దాకా పలుకుతుంది. అంటే ఎకరానికి 75 నుంచి లక్ష వరకు ఇన్కం వస్తుంది. వరితో పోలిస్తే లాభం ఎక్కువ వచ్చే పంటకావడంతో ఇటీవలి కాలంలో రైతులు దృష్టి సారిస్తున్నారు.
రాష్ట్ర సర్కారు కూడా ఇతర పంటల వేయాలని పిలుపునివ్వడంతో జిల్లా వ్యాప్తంగా 95 ఎకరాల్లో సాగు చేశారు. ఒక్క మంథని మండలంలోనే 22 మంది రైతులు 47 ఎకరాల్లో వేశారు. ఎక్లాస్పూర్, శాస్తృల్లపల్లి, లక్ష్మీపూర్ గ్రామాలకు చెందిన దండిగ రఘు, సిద్దిరామన్న, లొడారి రామయ్య, శీలం సత్యనారాయణరెడ్డి, గుండపు రాజలింగు, అల్లాఆల గట్టయ్య, వీరవేన ఓదెలు, గొర్రె రమేశ్, పర్శవేన శేరాలు, గొర్రె అయిలయ్య, బాద్రపు రవి, చెరుకుతోట సురేశ్ తొలిసారి యాసంగిలో పంట మార్పిడి చేశారు. ఈ పంటకాలం 100రోజులు కాగా, దిగుబడి మరో వారం లో చేతికి వస్తుందని రైతులు సంబుర పడుతున్నారు. పంట సాగు విధా నం, లాభాలను బేరీజు వేసు కుంటూ.. వరితో పోలిస్తే లాభాలు ఎక్కువని చెబుతున్నారు.
నేను ఎన్నో ఏండ్ల నుంచి వరినే సాగు చేస్తున్న. కానీ ఈ యేడు ఇతర పంటలు వేయాలని ప్రభుత్వం చెప్పడంతో మూడు మూడెకరాల్లో తెల్లజొన్న పెట్టిన. ఏ బాధా లేదు. ఒక రంబలు, రామచిలకలు, పిట్టల బాధ తప్ప వాటికి కావలి ఉండాల్సి వస్తున్నది. బెదుర్లు పెట్టిన. వరికంటే తెల్లజొన్న సాగు చాలా నయం. పని తక్కువ. నీళ్లు కూడా రోజూ పెట్టుడు అవసరం లేదు.
– లొడారి రామయ్య, రైతు, శాస్తృల్లపల్లి
తెలంగాణ మాగాణాల్లో ఎన్కటి నుంచి తెల్లజొన్న పండేది. కానీ, రైతులు తెల్లజొన్నకు దూరమై వరికి దగ్గరయ్యారు. వరికి బదులుగా ఇతర పంటలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ దిశగా మంథని మండలంలోని రైతులు తెల్లజొన్న సాగుకు ముందుకు వచ్చారు. మూస విధానాలను వదిలి కొత్త పద్ధతిలో వ్యవసాయాన్ని చేస్తూ లాభసాటిగా మల్చుకుంటున్నారు.
– మురళి, ఏడీఏ (మంథని)
తెల్లజొన్న పంట మేలైన పంట. మేం సాగు చేసి మూడు నెలలు కావస్తున్నది. అంటే ఇంకో వారం పది రోజుల్లో చేతికి రావచ్చు. అధికారుల సూచనల మేరకే వరిని తగ్గించి మూడెకరాల్లో తెల్లజొన్నను పండిస్తున్న. కంకి బాగానే వేసింది. దిగుబడి కూడా బాగానే వస్తుంది. అనుకున్నట్లుగా పంట చేతికి వస్తే మంచి లాభమే ఉంటుంది.
– దండిగ రఘు, రైతు (ఎక్లాస్పూర్)
మొదటి సారే జొన్నను సాగు చేస్తున్న. నేను ఐదెకరాల్లో సాగు చేస్తున్న. పంట బాగుంది. వరి సాగుతో పోలిస్తే సాగు ఖర్చులు చాలా తక్కువ. ఎకరానికి 6వేల దాకా అయినయ్. అదే వరి సాగు అంటే అధిక వ్యయంతో కూడిన పంట. పని కూడా ఎక్కువగా ఉంటుంది. తెల్లజొన్నలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. రేటు కూడా మంచిగానే ఉంది. పంటను చూస్తే సంబురమైతుంది.
నేను మొన్నటిదాకా కూలీ పనిచేసిన. ఉన్నంతల పిల్లలను చదివించుకుంటున్న. చేతిల డబ్బులే ఉండకపోయేది. సంపాదించినదంతా తిండిమందమే అయ్యేది. ఏదైనా చేద్దామనుకున్నా ఎల్లక ఇబ్బందులు పడ్డ. ఇక నా పరిస్థితి ఇంతే అనుకున్న. కానీ కేసీఆర్ దళిత బంధు పథకం తెచ్చి మా బతుకులు మార్చిండు. నేను ఐరన్ హార్డ్వేర్ షాపు పెట్టుకున్న. మొన్నటిదాకా కూలీ పనిచేసిన నేను ఇప్పుడు దుకాణానికి ఓనరైన. మరో ఇద్దరికి ఉపాధి కూడా కల్పిస్త. ఈ రోజే షాపు ప్రారంభించుకున్నం. చాలా సంతోషంగ ఉంది. నా బతుకు మార్చి జీవితంలో వెలుగులు నింపిన కేసీఆర్ను జీవితాంతం మరువ.
– బత్తుల ఎల్లయ్య, గండ్రపల్లి (జమ్మికుంట మండలం)