వేములవాడ, ఏప్రిల్16: ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు గానూ మెగా హెల్త్ మేళాలను నిర్వహిస్తున్నామని జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. శనివారం ఆయన వేములవాడ ఏరియా దవాఖానలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 18న వేములవాడ ఏరియా దవాఖానలో, 20న గంభీరావుపేటలో, 22న ఎల్లారెడ్డిపేటలో మెగా హెల్త్ క్యాంపు లు నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో అసంక్రమిత వ్యాధులపై అవగాహన కల్పించడమే కాకుండా, అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. అవసరమైనవారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని తెలిపా రు. స్త్రీ, పిల్లల, దంత, నేత్ర, చర్మ వ్యాధి వైద్యనిపుణుల తో పాటు క్యాన్సర్, కుష్టు, క్షయపై అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆయుర్వేదంతోపాటు యోగా, మెడిటేషన్‌పై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా 11 కౌంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉదయం 9నుంచి సాయంత్రం 5 గంట ల వరకు మేళాను నిర్వహిస్తున్నామని చెప్పారు. మేళాకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలన్నారు. వివరాలను నమోదు చేసుకొని డిజిటల్ కార్డులను అందజేస్తామని తెలిపారు. సమావేశంలో ఎన్సీడీ కోఆర్డినేటర్ మీనాక్షి తదితరులు ఉన్నారు.