వీణవంక, ఏప్రిల్ 16: రాష్ట్రంలో దళితుల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు పేర్కొన్నారు. మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో దళిత బంధు లబ్ధిదారులు దరిపెల్లి తిరుమల-మురళి మినీ సూపర్ మార్కెట్, కోండ్ర ప్రవళిక-అజయ్ వరినాటు యంత్రం, దరిపెల్లి మణెమ్మ-చంద్రయ్య వరినాటు యంత్రం, మంతెన శంకరమ్మ-లక్ష్మయ్య మినీ సూపర్ మార్కెట్, దరిపెల్లి బుజ్జమ్మ-మొగిలి ట్రాక్టర్, దరిపెల్లి కవిత-సారయ్య టాటాఏస్, గుండేటి రమేశ్ సూపర్ మార్కెట్ ఏర్పాటు చేయగా శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జీవీఆర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చి దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపారని కొనియాడారు. దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకులు ఓట్ల కోసమని తప్పుడు ప్రచారాలు చేసి నాలుగు ఓట్లు వేయించుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా దళిత బంధు పథకం ఫలాలు మాత్రం అర్హులందరికీ దక్కాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం యూనిట్లను గ్రౌండింగ్ చేయిస్తుంటే ప్రతిపక్షాల నోళ్లు మూతపడ్డాయని ఎద్దేవా చేశారు.
రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ దళిత బంధు వర్తింపజేస్తామని పునరుద్ఘాటించారు. మొదట తీసుకున్న దళిత కుటుంబాలు యూనిట్లను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నాయని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు పేదల ఆర్థికాభివృద్ధికే తప్పా ఓట్ల కోసమో, సీట్ల కోసమో కాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ మావురపు విజయభాస్కర్‌రెడ్డి, కో-ఆప్షన్ మెంబర్ హమీద్, సర్పంచ్ బండ సుజాత-కిషన్‌రెడ్డి, ఎంపీటీసీ రజిత-పుల్లారెడ్డి, నాయకులు సుధాకర్, మురళి, శంకర్, వెంకటస్వామి, శ్రీనివాస్, సదానందం, తిరుపతి పాల్గొన్నారు.
హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 16: తెలంగాణ ప్రభుత్వ హయాంలో దళితులకు ఆత్మగౌరవం పెరిగిందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని రాజపల్లి గ్రామానికి చెందిన సూర్యకళ-చేరాలు దంపతులు దళిత బంధు కింద కంగన్‌హాల్ ఏర్పాటు చేయగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా బండ శ్రీనివాస్ మాట్లాడుతూ, దళితులు ఆర్థికాభివృద్ధి సాధించడానికే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో దళిత బంధు కో-ఆర్డినేటర్ మొలుగూరి ప్రభాకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.