జూబ్లీహిల్స్ : క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. కరాటేతో పాటు ఆత్మరక్షణ క్రీడలుగా గుర్తింపు పొందిన థైక్వాండో క్రీడలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు.
మంగళవారం యూసుఫ్‌గూడ కోట్లవిజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ థైక్వాండో అసోసియేషన్ రెండు రోజులపాటు నిర్వహించిన 24 వ ఐటిఎఫ్ నేషనల్ థైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.
రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీలలో 9 రాష్ట్రాల నుంచి 380 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వి.మారుతి ప్రసాద్, కార్యదర్శి తోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.