
గట్టు, జనవరి 13 : గట్టు ఎస్సై మంజునాథ్‌రెడ్డి అవినీతి బాగోతం బయటపడింది. గట్టు జాతరలో ‘కాయ్ రాజా కాయ్’ ఆట నిర్వహించడానికి అనుమతి పేరిట రూ.50వేలు డిమాండ్ చేయడం.. రూ.40వేలు ఇస్తామంటే నేనెవరికి ఇచ్చుకోవాలబై అంటూ ఎస్సై, గట్టు యువకుడు వడ్డె భీమేశ్‌కు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వాయిస్ రికార్డ్ సోషల్ మీడియాలో గురువారం హల్చల్ చేసింది. ఈ సంభాషణ జిల్లాలో కలకలం రేపింది. గత నవంబర్‌లో ఎప్పటి మాదిరిగానే గట్టు జాతరలో ‘కాయ్ రాజా కాయ్’ ఆట నిర్వహించారు. ఈ ఆట నిర్వాహకుడు మారెప్ప. జాతర్లలో జూదం వ్యసనంలాంటి ఆటలను నిర్వహించడం మారెప్పకు వెన్నతో పెట్టిన విద్య. పల్లెల్లో లొడిబిడి ఆటగా చెప్పుకునే ఈ ఆట ఆడటం నిషేధం. అయినప్పటికీ పాలకులు, పోలీసులకు డబ్బు ఎరచూపి నిర్వాహకులు జాతర్లు, ఉర్సుల్లో ఈ ఆటను కొనసాగిస్తున్నారు. అయితే అప్పటి ఆట బాగోతం ఇప్పుడు బయటపడడం చర్చనీయాంశమైంది. ఆటను జాతర జరిగే ప్రాంతంలో కాకుండా హైస్కూల్ భవనం లోపల జరుపుకోమని ఎస్సై చెప్పడం ఇక్కడ కొసమెరుపు. ఈ వ్యవహారాన్ని పక్కన పెడితే.. గట్టుకు చెందిన యువకుడు వడ్డె భీమేశ్ చాలాకాలంగా పోలీసులతో చెట్టాపట్టాలు వేసుకు తిరుగుతుండడం మండలంలో అందరికీ తెలిసిందే. ఇతడు గట్టు పోలీసు వాహనాలకు ప్రైవేట్ డ్రైవర్‌గా కూడా ఇప్పటిదాకా పనిచేస్తున్నాడు. జూదంలాంటి ఆటలతోపాటు ఇసుక, మట్టి, రేషన్‌బియ్యం అక్రమ రవాణా ఎక్కడ జరిగినా సమాచారం రాబట్టుకునే నేర్పున్న భీమేశ్.. వెంటనే సమాచారాన్ని గట్టు పోలీసులకు చేరవేయడం విధిగా పెట్టుకున్నాడు. అయితే భీమేశ్పైనే గట్టు పోలీస్‌స్టేషన్‌లో ఐదు కేసులు నమోదయ్యాయి. ఇటీవల జరిగిన ఓ ఘర్షణకు సంబంధించి భీమేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, బెయిల్‌పై విడుదలయ్యాడు. అప్పటి నుంచి పోలీసులు, భీమేశ్ మధ్య సఖ్యత తగ్గింది. అలాగే బుధవారం రాత్రి ఇసుక ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ఇసుక దందాకు సంబంధించి నెలనెలా మామూళ్లు ఇచ్చినా కూడా పట్టుకోవడమేమిటని ట్రాక్టర్ల యజమానులు గురువారం నేరుగా పోలీస్‌స్టేషన్‌కే రావడం అందరినీ ఆశ్చర్యపర్చే అంశం. ఈ క్రమంలోనే ఎస్సై, గట్టు యువకుడికి మధ్య జరగిన సంభాషణ వాయిస్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్ కావడం అందరినీ ఆశ్యర్యపరుస్తోంది.
విచారణ చేసి నివేదిక ఇస్తాం
గట్టు ఎస్సై, యువకుడి మధ్య జరగిన సంభాషణ వాయిస్ రికార్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం స్పందించింది. ఎస్పీ ఆదేశాలమేరకు సీఐ ఎస్ఎం భాషా గట్టు పోలీస్‌స్టేషన్‌ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంభాషణ పూర్వాపరాలను పూర్తిగా పరిశీలిస్తామన్నారు. యువకుడిని విచారిస్తామని చెప్పారు. దీంతోపాటు ఎస్సైకి ఇసుక, మట్టి దందాల్లో పాత్ర ఉందో లేదో కూడా తేలుస్తామని స్పష్టంచేశారు. శుక్రవారం సాయంత్రం వరకు విచారణను పూర్తిచేసి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని సీఐ పేర్కొన్నారు.