ధర్మపురి, ఏప్రిల్ 2: ఎల్ఎమ్ కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబురాలు అంబరాన్నంటాయి. చివరి రోజు పురస్కారాల ప్రదానోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ, గాయని ఒల్లాల వాణి హాజరుకాగా, మంత్రి ఈశ్వర్ వారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మపురి నృసింహ నాట్య మండలి ఆధ్వర్యంలో 20మంది ఆర్టిస్టులతో ప్రదర్శించిన కృష్ణార్జున యుద్ధం నాటకం ఆకట్టుకున్నది. అనంతరం ధర్మారానికి చెందిన యోగా గురూజీ జంగిలి సుధాకర్ యోగాసనాలు వేయగా, ధర్మపురికి చెందిన బుగ్గారపు సునీల్‌శర్మ పంచాంగ పఠనం చేశారు.
ఉగాది సంబురాల్లో భాగంగా 286 మందికి మెమోంటోలతో పాటు పురస్కార పత్రాలను మంత్రి ఈశ్వర్, ఎల్ఎమ్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ స్నేహలత అందజేసి, సన్మానించారు. ఇక్కడ డీసీఎమ్మెస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీటీసీ బాధినేని రాజేందర్, ఎంపీపీ చిట్టిబాబు, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ ఉన్నారు. కాగా, అంతకుముందు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈశ్వర్ ఘన స్వాగతం పలికారు.