అశోక్ సెల్వన్, రితూ వర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఆకాశం’. ఈ చిత్రాన్ని వయాకామ్ 18 స్టూడియోస్, రైజ్ ఈస్ట్ సమర్పణలో శ్రీనిధి సాగర్ నిర్మిస్తున్నారు. రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 4న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా హైదరాబాద్లో చిత్రబృందం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో అశోక్ సెల్వన్ మాట్లాడుతూ…‘తెలుగులో నా గత చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’ను ఆదరించారు.
నా సినిమాలకు మహేష్ బాబు, నాని సపోర్ట్ చేశారు. ఒక మంచి సినిమా వస్తుందంటే ప్రోత్సహించడానికి మన స్టార్స్ సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రానికొస్తే ..ఇదొక పాజిటివ్ మూవీ. సంతోషాలను పంచేలా ఉంటుంది. మరో మంచి మూవీతో మీ ముందుకొస్తున్నాను. ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు. శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ..‘ఒక అందమైన లైఫ్ జర్నీని చూపించే చిత్రమిది. మేమంతా కష్టపడి ఇష్టపడి పనిచేశాం. నిజాయితీ గల స్వచ్ఛమైన ప్రయత్నాన్ని మా సినిమాలో చూస్తారు’ అని చెప్పింది. ఆహ్లాదకరంగా సాగే వైవిధ్యమైన కథను మా చిత్రంలో చూస్తారని నాయిక రితూ వర్మ చెప్పారు.