ఎదులాపురం, మే 2: వివాహేతర సంబంధం ఇరువర్గాల మధ్య గొడవకు దారితీసింది. డీఎస్పీ వెంకటేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం..ఆదిలాబాద్‌లోని కేఆర్కే కాలనీకి చెందిన ఆనంద్ అదే కాలనీకి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం ఆమె భర్త గౌస్‌కు తెలియడంతో విడాకులు ఇచ్చాడు. అప్పటి నుంచి ఆనంద్ ఆ మహిళను న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో అద్దె ఇంట్లో ఉంచాడు. గౌస్ అదేకాలనీలో ఉంటూ ఆటో నడుపుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఆనంద్ మిత్రుడు జాకీతో కలిసి గౌస్ ఇంటికి వెళ్లారు. ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించారు. దీంతో మావల పోలీస్ స్టేషన్లో గౌస్ ఫిర్యాదు చేశాడు. రాత్రి 12.30 గంటలకు మరోసారి ఆనంద్, జాకీ గౌస్ ఇంటికి వెళ్లి బెదిరించారు. ఈ విషయాన్ని గౌస్ తన స్నేహితుడు సాజిద్‌కు చెప్పాడు. ఈ వ్యవహారంలో మధ్య లో వచ్చిన సాజిద్‌ను కూడా బెదిరించారు. ఆయనపై కోపం పెంచుకున్న ఆనంద్, తన తల్లి, కౌన్సిలర్ అంజుతో కలిసి సాజిద్ అంబేద్కర్ విగ్రహాన్ని అగౌరవ పరిచాడని, తనను కులం పేరుతో దూషించాడని అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఠాణాలో ఫిర్యాదు చేశారు.
సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కేఆర్కే కాలనీలోని సాయిరాం టెంట్ హౌస్ వద్ద కూర్చున్న సాజిద్‌ను ఆనంద్‌తో పాటు మరో నలుగురు తీవ్రంగా కొట్టగా సాజిద్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా, పలు విషయాలు వెలుగులోగి వచ్చాయని డీఎస్పీ తెలిపారు. వివాహేతర సంబంధం వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆనంద్ కమ్యూనిటీ గొడవగా మార్చి, పెద్ద గొడవకు కారకుడయ్యడని వెల్లడించారు. సాజిద్ అంబేద్కర్ విగ్రహాన్ని అగౌరవ పర్చలేదని తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ సాజిద్, నాందేవ్ రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కాగా, కాలనీలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటుచేశారు. డీఎస్పీలు వెంకటేశ్వరరావు, విజయ్‌కుమార్, సీఐ రఘుపతి, కృష్ణమూర్తి బందోబస్తు నిర్వహించారు.