“వ్యవసాయశాఖ అధికారులు రైతులతో మమేకమై పనిచేయాలి. రైతువేదికల్లో క్లస్టర్లవారీగా తరచూ వారితో సమావేశాలు నిర్వహించాలి. మూస సాగుకు స్వస్తిపలికేలా.. విభిన్న పంటలు వేసేలా ప్రోత్సహించాలి.” అని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో సోమవారం ‘వానకాలం పంటల సాగు సన్నద్ధత’ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిరంజన్‌రెడ్డితోపాటు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేలా, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు మాత్రమే వేసేలా రైతులకు తెలియజేయాలి. రైతులు సొంత గ్రామాల్లోనే కాకుండా ఇతర గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో పర్యటించేలా ప్రోత్సహించాలన్నారు.
నిర్మల్, మే 2(నమస్తే తెలంగాణ ) : వ్యవసాయశాఖలో పనిచేస్తున్న ఏవోలు, ఏఈవోలు తమ పరిధిలోని రైతులతో తరచూ మాట్లాడుతూ వారితో మమేకం కావాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన ‘వానకాలం పంటల సాగు సన్నద్ధత-అవగాహన సదస్సులో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. క్లస్టర్లవారీగా ఏఈవోలు రైతువేదికల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ పథకాలను వివరించాలి. ముఖ్యంగా రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచేలా చూడాలి. అలాగే ఒకే రకమైన మూస విధానంలో పంటలు వేయడం వల్ల కలిగే ఇబ్బందులను తెలియజేయాలి.
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేసేలా ప్రోత్సహించాలని సూచించారు. పంటల మార్పిడి వల్ల అధిక దిగుబడితోపాటు ఆదాయం సమకూరుతుందన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారని, తెలంగాణలో తొలి ప్రాధాన్యత వ్యవసాయానికేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం రైతుల అభ్యున్నతి కోసమే ఆలోచిస్తారని తెలిపారు. వ్యవసాయానికి ఈ ప్రాంతంలోని భూములు ఎంతో అనుకూలమైనవన్నారు. పత్తి పంటకు ఈసారి మద్దతు ధర కంటే ఓపెన్ మార్కెట్లో రికార్డుస్థాయిలో ధర లభించిందన్నారు. వేరుశనగకు కూడా మద్దతు ధరకు మించి రూ.9 నుంచి రూ.10 వేలు పలికిందన్నారు. రైతులు ఈసారి పత్తి, సోయాతోపాటు కంది, మినుము వంటి పప్పుదినుసుల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. లైసెన్సు కలిగి ఉన్న డీలర్ల వద్దనే కాటన్ విత్తనాలను కొనుగోలు చేసి కచ్చితంగా రసీదు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయాధికారుల సూచనల మేరకే ఎరువులు, రసాయనాలను ఉపయోగించాలన్నారు. పశువుల ఎరువు, పచ్చిరొట్ట లాంటి ఎరువులను వాడి భూమిలోని సారాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలన్నారు.
వ్యవసాయాన్ని లాభసాటి చేయడం అంటే సాగులో పెట్టుబడులు తగ్గించుకోవడం, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయడం, పంటల దిగుబడి పెంచుకోవడం ద్వారానే అది సాధ్యమవుతుందన్న విషయాన్ని రైతులకు అర్థం చేయించాలని, రైతులు తమ స్వంత గ్రామాల్లోనే కాకుండా ఇతర గ్రామాలు, మండలాలు జిల్లాల్లో పర్యటించి ఇతర రైతుల విజయాలను తెలుసుకోవాలని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా విభిన్న పంటలపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనలేక కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో సాహసంతో ధాన్యం కొనుగోళ్లకు ముందుకొచ్చారన్నారు. పంటల మార్పిడిలో భాగంగా ఆయిల్ పాం సాగును రైతులు ఎంచుకోవాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది రెండు నుంచి రెండున్నర లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం సాగును లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. నిర్మల్ జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది పది వేల ఎకరాల్లో ఆయిల్ పాం సాగు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అనంతరం పలువురు ఏఈవోలతో మాట్లాడిన మంత్రి క్షేత్రస్థాయిలో సమస్యలు, పంటల సాగు, రైతులతో అనుభవాలు, ఎరువుల యాజమాన్యం, 2014కు ముందు, ఆ తరువాత వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులను అడిగి తెలుసుకున్నారు. కాగా.. అంబేద్కర్ భవన్ ఆవరణలో ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రులు పరిశీలించారు. ఇక్కడి స్టాల్లో ఉంచిన ఆయిల్ పాం గెలలు, మొక్కలు పలువురిని ఆకట్టుకున్నాయి.
ఈ వర్క్‌షాప్ ద్వారా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలు గ్రామాల్లోని రైతులకు తెలిసే అవకాశం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగులో భాగంగా ఆయిల్‌పామ్ తోటల సాగును ఎక్కువగా ప్రోత్సహిస్తున్నది. దీనివల్ల దీర్ఘకాలిక ఆదాయం సమకూరుతుంది. సంప్రదాయ పంటలకంటే అధిక లాభాలు గడించవచ్చు. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 10వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే జూన్, జూలైలో మూడు వేల ఎకరాలకు ప్రణాళిక తయారు చేశాం. ఇందుకు అవసరమైన మొక్కలు అందుబాటులో ఉన్నాయి. 688 మందికి చెందిన రైతుల భూముల్లో 1.50 లక్షల మొక్కలు నాటబోతున్నాం.
– శ్యాంరావ్ రాథోడ్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, నిర్మల్
నాకు నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. రెండేళ్లుగా నాటు వేసే విధానం కాకుండా వెదజల్లే పద్ధతిలో వరి పంట సాగు చేస్తున్నా. దీంతో ఎకరానికి రూ.5 వేల నాటు ఖర్చు తగ్గిం ది. దిగుబడి కూడా ఎకరానికి రెండు క్వింటాళ్లు అధికంగా వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వెదజల్లే పద్ధతిని ప్రోత్సహిస్తు న్నది. వరి రైతులందరూ ఈ పద్థతిలోనే సాగు చేసేలా అవగాహన కల్పిస్తున్నాం. కేజ్‌వీల్‌తో దమ్ముకొట్టే అవసరం లేకుండానే ఈ పద్ధతిలో వరి సాగు చేయవచ్చు. దీంతో ట్రాక్టర్ అద్దె ఖర్చులు కూడా మిగిలే అవకాశం ఉంది. కల్టివేటర్ చేసి వరి విత్తనాలను చల్లాలి. ఆశించిన దిగుబడులు వస్తాయి. – పిండి శ్రీనివాస్, రైతుబంధు సమితి కోఆర్డినేటర్, సిద్ధాపూర్
75 ఏండ్ల స్వాతంత్య్ర భారతావనిలో రైతురాజ్యం అనే నినాదంతో అనేక ప్రభుత్వాలు పబ్బం గడుపుకున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత రైతేరాజు అనే కలను సీఎం కేసీఆర్ నిజం చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటిరంగ ప్రాజెక్టులతో పుష్కలంగా సాగు నీరు అందుబాటులోకి వచ్చిందన్నారు.
24 గంటలపాటు ఉచితం కరెంటు, రైతుబంధు పేరిట పెట్టుబడి సహాయం అందుతుండడంతో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. సాగు నీటి కష్టాలు తీరడంతో కొద్ది కాలంగా రైతులందరు ఒకే రకమైన పంటలు సాగు చేస్తున్నారని, అలా కాకుండా వివిధ రకాల పంటల వైపు మొగ్గు చూపేలా వ్యవసాయాధికారులు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. లాభదాయక పంటలపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రైతులు కూడా సహకరించి వ్యవసాయశాఖ అధికారులు తెలియజేసిన సూచనలు, సలహాలను పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్, రాథోడ్ బాపురావ్, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్లు గండ్రత్ ఈశ్వర్, అంకం రాజేందర్, వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్‌రావు, ఉద్యానవనశాఖ డైరెక్టర్ వెంకట్రామ్రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి శ్యాంరావ్ రాథోడ్లతోపా టు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు రైతుబంధు సమితి గ్రామ, మండల కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
జన్నారం, మే 2 : ఆయిల్ పాం సాగుతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండలంలోని దేవునిగూడ గ్రామంలో నూతనంగా రైతులు సాగుచేస్తున్న ఆయిల్‌పాం మొక్కలను రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి సోమవారం పరిశీలించారు. అక్కడ మంత్రులు మొక్కలు నాటారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని దీర్ఘకాలికంగా పొందడానికి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
అంతకుముందు తొమ్మిది గుడిసెలపల్లె గ్రామంలో పొనకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, తహసీల్దార్ కిషన్, ఎంపీడీవో అరుణారాణి, ఎంవో సంగీత, మార్కెట్ కమిటీ చైర్మన్ సీపతి బుచ్చన్న, ఎంపీపీ మాదాడి సరోజన, మండలాధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి, గుర్రం గోపాల్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు శీలం రమేశ్, నాసాని రాజన్న, మండల కో ఆప్షన్ సభ్యుడు మున్వర్అలీఖాన్, వైస్ చైర్మన్ సిటిమల భరత్‌కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యం సతీశ్, సులువ జనార్దన్, స్వదేశీరావు, వై అభిలాశ్ రావు, విక్రంరావు, బోడ శంకర్ పాల్గొన్నారు.
ఈ వానకాలం సాగు కోసం అన్ని రకాల విత్తనాలను సిద్ధంగా ఉంచాం. మొదటి ప్రాధాన్యత కింద పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేస్తాం. ఈ పంపిణీ కార్యక్ర మాన్ని ఈ నెల చివరి వరకు ప్రారంభి స్తాం. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఆరు వేల క్వింటాళ్ల పచ్చి రొట్ట విత్తనాలు అందు బాటులో ఉన్నాయి. వచ్చే జూన్‌లో కంది విత్తనాలను పంపిణీ చేస్తాం. ప్రస్తుతం 1400 క్వింటాళ్ల కంది విత్తనాలు, 6 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. రైతులు ప్రభుత్వ సంస్థల తయారీ విత్తనాలను వినియోగించాలి.
– అతుల్ కుమార్ జైన్, రాష్ట్ర సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆర్ఎం