బెల్లంపల్లి టౌన్, మే 1 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నూతన గ్రంథాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. రెండేళ్ల క్రితం భవన నిర్మాణం ప్రారంభం కాగా.. ఇటీవలే పూర్తయింది. ఇప్పటివరకు తాత్కాలిక గదుల్లో కొనసాగిన గ్రంథాలయం పక్కా భవనంలోకి మారనుంది. బెల్లంపల్లి శాఖ గ్రంథాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం జరగనుంది.
కార్యక్రమానికి ముఖ్య అథితులుగా ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరై ప్రారంభించనున్నారు. తాజాగా రాష్ట్ర సర్కారు వేలాది పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ క్రమంలో నూతన లైబ్రరీ ప్రారంభం కానుండడంతో పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బెల్లంపల్లి శాఖ గ్రంథాలయాన్ని మొదట సీఐ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేశారు. రెండే గదులు ఉండడంతో పాఠకులు అవస్థలు పడేవారు. కేవలం దినపత్రికలే రావడం, బస్తీకి దూరంగా ఉండడంతో విముఖత చూపేవారు. దీంతో 2016లో లైబ్రరీని బజార్ ఏరియాలోని పాత క్లబ్ పాఠశాలలోకి మార్చారు.
ఇక్కడ కూడా భవనాలు శిథిలావస్థకు చేరుకోవడం, కూర్చోవడానికి కూడా సౌకర్యాలు లేకపోవడం, కొన్ని సందర్భాల్లో భవనం పైపెచ్చులు కూలి పాఠకులకు గాయాలు కూడా అయ్యాయి. స్టడీ మెటీరియల్ కూడా లేకపోవడంతో సమస్యలను అప్పటి సబ్ కలెక్టర్ రాహుల్రాజ్ దృష్టికి పాఠకులు తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఆయన కొంత స్టడీ మెటీరియల్ కూడా తెప్పించారు.
మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే పక్కా భవనాల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. బెల్లంపల్లి గ్రంథాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో సర్కారు రూ.75 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో మహిళలు, పురుషులకు వేరువేరుగా రీడింగ్ రూములు, దినపత్రికలు చదివే వారికి హాల్, రెండు హాళ్లలో ఏసీ సౌకర్యం, కుర్చీలు ఏర్పాటు చేశారు. భవనం ఆవరణలో విశాలమైన స్థలం ఉండడంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు ఆరు బయట చదువుకునే అవకాశం ఉంది.
మంచిర్యాల జిల్లాలో పాఠకులకు అందుబాటులో అధునాతన గ్రంథాలయాలు ఏర్పాటు చేశాం. ఇప్పటికే జిల్లా కేంద్రంలో, చెన్నూర్ నియోజకవర్గంలో భవనాలు ప్రారంభించాం. సోమ వారం బెల్లంపల్లి నూతన గ్రంథాలయ భవనం ప్రారంభం కానుంది.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ను అందుబాటులో ఉంచాం. 60వేల విలువైన పుస్తకాలను మాజీ కౌన్సిలర్ డాక్టర్ తోడే వంశీకృష్ణారెడ్డి అందించారు. ఇదే విధంగా దాతలు మరింతగా ముందుకు రావాలి. గ్రంథాలయాన్ని పాఠకులు సద్వినియోగం చేసుకుని పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి.
– రేణికుంట్ల ప్రవీణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
పాత క్లబ్ పాఠశాలలో ఉన్న గ్రంథాలయంలో బిక్కుబిక్కుమంటూ చదువుకున్నాం. ఎప్పుడు పైన స్లాబ్ కూలిపోతుందో అనే భయంతో ఉండేవాళ్లం. నూతన భవనం ప్రారంభించనుండడం సంతోషంగా ఉంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారికి వరం. మూడు నెలలపాటు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తీసుకునే అభ్యర్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. నేను కూడా గ్రూప్-2కు ప్రిపేర్ అవుతున్నా.
– గాండ్ల మధు, పాఠకుడు