రైతుల సంక్షేమానికి పలు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు సాగులో అవసరమైన ప్రోత్సాహం అందిస్తున్నది. ఇందులో భాగంగా నేడు(సోమవారం) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం పంటలపై అవగాహన కల్పించనున్నారు. నిర్మల్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల సదస్సు, మంచిర్యాల జిల్లాలో కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన వ్యవసాయ, హార్టికల్చర్, రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమాలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హాజరుకానున్నారు. పత్తి, కంది పంటల విస్తీర్ణం పెంచడం, ఎరువుల వాడకం తగ్గించడం, వరిసాగులో విత్తనాలను వెదజల్లడం వంటి అంశాలపై అధికారులు సలహాలు, సూచనలు అందించనున్నారు.
ఆదిలాబాద్, మే 1( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులపై వివక్ష చూపుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రంమ అన్నదాతలకు అండగా నిలుస్తున్నది. రెండు సీజన్లలో పంటల సాగుపై అవగాహన, విత్తనాలు, ఎరువుల పంపిణీ, నకిలీ విత్తనాల నివారణ, సాగునీటి సరఫరా, ఇతర సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. పంటల సాగులో భాగంగా చీడ పురుగులు, తెగుళ్ల నివారణపై వ్యవసాయ అధికారులు రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
అన్నదాతలు ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలను దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నది. తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న పథకాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయం లాభసాటిగా మారింది. ఏటా సీజన్ ప్రారంభంలో రైతులకు పంటల సాగుపై ప్రభుత్వం అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నది. ఎలాంటి పంటలు సాగు చేయాలి, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, మార్కెటింగ్, పంటల సాగులో అనుకూలించే అంశాలపై రైతులకు అధికారులు తగిన సలహాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నది.
ఇందులో భాగంగా వానాకాలం పంటల సాగుపై ఉమ్మడి జిల్లాలోని రెండు జిల్లాల్లో సోమవారం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. ఈ సదస్సులకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హాజరు కానున్నారు. ఈ సమావేశాల్లో ఏఈవోలు, ఏవోలు, ఏడీలు, డీఏవోలతో పాటు హార్టికల్చర్ అధికారులు, గ్రామ, మండల స్థాయి రైతుబంధు సమితిల కో ఆర్డినేటర్లు పాల్గొనున్నారు. ఉద యం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన సమావేశం నిర్మల్‌లో, మధ్యాహ్నం మంచిర్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సదస్సు మంచిర్యాలలో జరగనుంది.
వానాకాలం పంటల సాగుపై సోమవారం నిర్వహించ నున్న సదస్సుల్లో అధికారులు పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటారు. ముందుగా అధికారులు, రైతుబంధు కమిటీ సభ్యులకు సలహాలు, సూచనలు అందజేస్తారు. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో వరి ఎక్కువగా సాగువుతుంది. పత్తి, కంది పంటలు లాభదాయకంగా ఉండడంతో రెండు పంటల సాగును ప్రోత్సహించనున్నారు.
వరిసాగులో పంటపెట్టుబడిని తగ్గించుకునేలా నారు విధానంలో కాకుండా విత్తనాలను వెదజల్లే పద్ధతిపై అవగాహన కల్పిస్తారు. పంటల సాగులో భాగంగా రైతులు రసాయన ఎరువులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. పంటలకు అవసరమైన సమయంలో మాత్రమే తగు మోతాదులో ఎరువులను వినియోగించేలా చూడడంతో పాటు భూమిలో ఉన్న పీఎస్బీ విధానం వల్ల పాస్ఫరస్‌ను కరిగించి మొక్కలకు అందేలా చూస్తారు. వీటితో పాటు పచ్చి రొట్టె ఎరువులను రైతులు ఎక్కువగా వాడేలా అధికారులు, రైతుబంధు సమితిల సభ్యులు చర్యలు తీసుకోనేలా ఈ సదస్సుల్లో అవగాహన కల్పిస్తారు.