కౌటాల, ఏప్రిల్ 30 : ప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తున్నది. ఈ క్రమంలో ఎంతో మంది యువకులు ఉద్యోగాలు దొరకక, ఉన్న ఉద్యోగాలు పోయి ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు వివిధ స్వయం ఉపాధి మార్గాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త వ్యాపారం, కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. మండలంలోని మొగఢ్దగఢ్ గ్రామంలో హివర్కార్ మనీశ్, నక్క సుధాకర్‌తో పాటు భుజంగరావు స్వయం ఉపాధి వైపు అడుగులు వేశారు. వారికి తట్టిన ఆలోచనతో నాటుకోళ్ల పెంపకం చేపడుతూ ఆర్థికంగా లాభాలను పొందుతున్నారు.
నాటు కోళ్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నందున వాటి పెంపకం వైపు యువకులు ముందడుగు వేస్తున్నారు. గ్రామానికి చెందిన హివర్కార్ మనీశ్, అతని బంధువు పాల్ భుజంగరావు మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి ఒకరోజు వయసున్న నాటు కోడి పిల్లలను తెచ్చి పెంచుతున్నారు. మొదట భుజంగరావు చంద్రపూర్ నుంచి మూడు నెలల క్రితం అసిల్ జాతికి చెందిన 300 పిల్లలను, ఒక్కోటి రూ.60 చొప్పున కొనుగోలు చేశాడు. అందులో 20 పిల్లలు వివిధ కారణాలతో చనిపోయాయి. మిగతావి పెరిగాయి.
కోడి పిల్లలు ఇప్పుడు కిలో నుంచి 1.5 కిలోల వరకు బరువు ఎదిగాయి. ఇవి కిలోకు రూ.400 చొప్పున అమ్ముడుపోతున్నాయి. భుజంగరావు ఇప్పటి వరకు కోడి పిల్లల కొనుగోలుకు రూ.18వేలు, వాటి దాణాకు రూ.25 వేలు, మందులకు కలిపి మొత్తం రూ.45 వేల వరకు ఖర్చు పెట్టాడు. ఇందులో ఇప్పటి వరకు 50 కోళ్లను అమ్మగా.. రూ.20 వేల వరకు ఆదాయం వచ్చింది. ప్రస్తుతం అతని దగ్గర 230 వరకు కోళ్లున్నాయి. వాటి ద్వారా అతనికి దాదాపు రూ.1.40 వేలపైనే ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
మనీశ్ వెయ్యి కోడి పిల్లలు తెచ్చాడు. ఇవి నెల రోజుల వయసుకు ఎదిగాయి. ఇందులో 50 వరకు పిల్లలు వివిధ కారణాలతో చనిపోయాయి. మిగిలిన 950 పిల్లలున్నాయి. ప్రస్తుతం ఒక్కోటి 500 గ్రాముల నుంచి 700 గ్రాముల వరకు పెరిగాయి. మనీశ్‌కు పిల్లల కొనుగోలు, వాటి కోసం దాణాకు కలిపి రూ.1.20 లక్షల వరకు ఖర్చు అయ్యింది. మరో నెల రోజుల్లో ఇవి అమ్మకానికి వస్తాయి. ఒక్కోటి కిలోకు పైగా బరువు పెరుగుతాయి. దీంతో అతనికి రూ.4 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
అదే గ్రామానికి చెందిన నక్క సుధాకర్ సుమా రు 1.5 కిలోల బరువున్న అసిల్ జాతికి చెందిన కోళ్లను పెంచుతున్నాడు. 200 కోళ్లను హైదరాబాద్ నుంచి తెచ్చాడు. పెంచుతూ వ్యాపారం చేస్త్తున్నాడు. ఎదిగిన కోళ్లను తక్కువ ధరకు తెచ్చి వాటిని పెంచి అమ్మడంతో కిలోకు దాదాపు రూ.100 నుంచి రూ.150 వరకు లాభం వస్తున్నట్లు సుధాకర్ తెలిపాడు.
డిగ్రీ వరకు చదివి డీఎడ్ పూర్తి చేశా. మూడేండ్ల పాటు విద్యావలంటీర్‌గా పనిచేశా. ప్రభుత్వం నన్ను తొలగించడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదో చేయాలని ఆలోచిస్తుండగా.. మా బంధువొకరు నాటుకోళ్ల పెంపకం ప్రారంభించాడు. నేను కూడా మహారాష్ట్రకు వెళ్లి పిల్లలను తీసుకొచ్చా. న్లైంది. కోళ్లు తొందరగానే పెద్దగా అవుతున్నాయి.
– హివర్కార్ మనీశ్
నేను డిగ్రీ వరకు చదివి వెటర్నరీలో గోపాల మిత్ర కోర్స్ చేశా. తెలిసిన వాళ్ల ద్వారా నాటు కోళ్ల వ్యాపారం ప్రారంభించా. హైదరాబాద్ నుంచి పెరిగిన అసిల్ జాతికి చెందిన కోళ్లను కొని ఇక్కడ 15 నుంచి నెల రోజుల పాటు పెంచాను. ఊర్లు తిరుగుతూ అమ్ముతాను. ఒక్కో కిలోకు రూ.100 నుంచి రూ.150 వరకు లాభం వస్తున్నది.
– నక్క సుధాకర్
మా ఊరి శివారులో రెండెకరాల భూమి ఉంది. ఏ పంటలు వేసినా దిగుబడి రాక అప్పులవుతున్నాయి. తెలిసిన ఒకతను నాటు కోళ్లు పెంచమని చెప్పాడు. మూడు నెలల క్రితం మహారాష్ట్రకు వెళ్లి 300 కోడి పిల్లలు తెచ్చా. ఇంటి వద్దే అమ్ముడు పోతున్నాయి. కిలోకు రూ.400 ఉండడంతో ఖర్చులు పోనూ లాభాలు వస్తున్నాయి.
– పాల్ భుజంగరావు