చెన్నూర్, ఏప్రిల్ 30 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో ప్రజలు సేదతీరేందుకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రత్యేకంగా పార్కును నిర్మిస్తున్నారు. పట్టణ నడిబొడ్డున, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన సుమారు 2.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.2.50 కోట్లు వెచ్చించి సుందరంగా నిర్మిస్తున్నారు. పనులు శరవేగంగా సాగుతుండగా.. మూడు నెలల్లో అందుబాటులోకి రానున్నది. నిర్మాణంపై విప్ సుమన్ ప్రత్కేక శ్రద్ధ పెట్టారు. పలుమార్లు పనులను కూడా పరిశీలించారు. పనుల తీరు తెలుసుకొని సూచనలు కూడా చేశారు. ఇందులో చిన్నారుల పార్కు, యువతీయువకుల కోసం ఓపెన్ జిమ్, యోగా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. పార్కులో ప్రజల ఆహ్లాదం కోసం గడ్డి, పూలు, నీడనిచ్చే చెట్లను పెంచుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళ వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. వాటర్ ఫౌంటెయిన్, మ్యూజిక్ ఫౌంటెయిన్ కూడా ఉండనున్నాయి. సేద తీరడానికి కుర్చీలు, ప్రవేశద్వారం వద్ద పెద్ద రెండు బొమ్మలను ఏర్పాటు చేశారు. అలాగే పార్కుకు వచ్చే వారి కోసం మరుగు దొడ్లు, మూత్రశాలలు కూడా నిర్మిస్తున్నారు.
పిల్లల కోసం ప్రత్యేక పార్కును నిర్మిస్తున్నారు. పిల్లలు ఆడుకునేందుకు, వారి తల్లిదండ్రులు పిల్లలను ఆడించేందుకు వివిధ రకాల ఆట వస్తువులను అందుబాటులో ఉంచారు.
పార్కులో యువకుల కోసం ప్రత్యేకంగా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నారు. యువకులు వ్యాయామం చేసుకునేందుకు వీలుగా అన్ని రకాల పరికరాలు అందుబాటులో పెట్టారు.
యువతీయువకులు యోగా చేసుకునేందుకు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. యోగాకు అవసరమైన ఏర్పాట్లన్నీ కేంద్రంలో కల్పించనున్నారు.
పట్టణ ప్రజల కోసం పట్టణ నడిబొడ్డున కేసీఆర్ పేరుతో పార్కును నిర్మిస్తున్నాం. తీరిక సమయంలో పార్కును సందర్శించే ప్రజల కోసం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాం. అన్ని వయస్సుల వారికి అనుగుణంగా.. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసుకునేందుకు వీలుగా వాకింగ్ ట్రాక్‌ను నిర్మిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పచ్చని గడ్డి, వివిధ రకాల పూల మొక్కలతోపాటు నీడ నిచ్చే చెట్లను పెంచుతున్నాం. పనులను రెండు, మూడు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.
– బాల్క సుమన్, ప్రభుత్వ విప్.
చెన్నూర్ పట్టణంలో నిర్మిస్తున్న కేసీఆర్ పార్కు పట్టణ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. యువకుల వ్యాయామం కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం అభినందనీయం. యోగా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా మంచిది. అన్ని రకాల సౌకర్యాలతో నిర్మిస్తున్న పార్కు ప్రజలకు ఉపయోగ పడనుంది.
– గూడెం రామారావు, యువకుడు, చెన్నూర్