నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 30 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నా రు. గత వారం రోజులుగా రాష్ట్రంలోనే దాదా పు 5 రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజ లు అత్యవసర పనులుంటే తప్పా బయటకు వెళ్లడం లేదు. ఇదిలాఉంటే ఇప్పటి వరకు జిల్లాలో పలువురు వడ దెబ్బతో మృతి చెందారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజుల నుండి ఉమ్మడి జిల్లాలో 42-45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరిమెరిలో శనివారం అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. నిర్మల్ జిల్లాలోని కడెం మండలం పెద్దూరులో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్‌లో 45.4, మంచిర్యాల్ జిల్లాలోని హాజీపూర్‌లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
జిల్లాలో ఈ నెలలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆది, సోమవారాల్లో మూడు రోజుల పాటు నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్ జిల్లాలో వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే టోపీ, టవల్, పండ్ల రసాలు, ఓఆర్ఎస్ పౌడర్ తీసుకుంటూ కనీస జాగ్రత్తలు పాటిస్తూ బయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.
తేది నిర్మల్ ఆదిలాబాద్ కుమ్రం భీం ఆసిఫాబాద్
30-4-2022 45.7 45.4 45.8
29-4-2022 44.8 44.0 44.4
28-4-2022 44.8 45.1 43.0
27-4-2022 44.1 44.1 43.9
26-4-2022 44.8 44.8 44.2
25-4-2022 39.6 42.0 42.0
24-4-2022 43.3 43.3 40.7