కాగజ్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 29 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం జరగనున్న జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడిజిల్లాలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో జవహర్ నవోదయ విద్యాలయం ఒక్కటే ఉంది. ఇందులో ఆరో తరగతిలో 80 సీట్లు ఉండగా, 6148 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు.
గతేడాది కరోనా నేపథ్యంలో ప్రవేశ పరీక్షకు కేవలం 2,972 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 2022-23 విద్యా సంవత్సరానికి 6,148 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులను ఉదయం 11 గంటలకే పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లపై ఐదో తరగతి చదివే పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను , పరీక్ష ప్యాడ్, వాటర్‌బాటిల్, మాస్క్ ధరించి పరీక్షకు హాజరు కావాలి.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 14 బ్లాకుల్లో 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లాలో 10 కేంద్రాల్లో 1710 మంది విద్యార్థులు, మంచిర్యాల జిల్లాలో 9 సెంటర్లలో , 1590 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 10 కేంద్రాల్లో, 1633 మంది, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 7 సెంటర్లలో , 1215 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 36 మంది సూపరింటెండెంట్లు , 9 మంది రూట్ ఆఫీసర్లు, 520 మంది ఇన్విజిలేటర్లు, ఎగ్జామ్స్ ఫ్లైయింగ్ స్వాడ్లుగా రెవెన్యూ అధికారులను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.
జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6,148 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారికోసం 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నాం. విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రానికి రావాలి. కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలి.
– చక్రపాణి, జవహర్ నవోదయ పిన్సిపాల్