ఎదులాపురం, ఏప్రిల్ 23 : ఆదిలాబాద్ జిల్లాలోని మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం మాజీ సైనికులతో సమావేశం నిర్వహించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. సైనిక్ భవన్, ఉద్యోగాలు, పలు దరఖాస్తులు వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్నాయని కలెక్టర్‌కు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ దేశానికి సేవ చేసి విశ్రాంతి పొందిన సైనికుల సమస్యలు పెండింగ్‌లో ఉండకుండా చూడాలన్నారు. 270 మంది మాజీ సైనికులకు ఐడీ కార్డులు జారీ చేశామని తెలిపారు. స్థలం, సైనిక్ భవనం, బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి వాటిని పరిష్కరిస్తామన్నారు. స్వయం ఉపాధి కల్పనకు పీఎంఈజీపీ నిబంధనల ప్రకారం జీఎండీఐసీ, కేవీఐసీ ద్వారా ఆర్థిక సహాయం పొందవచ్చని పేర్కొన్నారు.
అలాగే రిమ్స్‌లో మాజీ సైనికులకు వైద్య చికిత్సల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఇక నుంచి నిత్యం సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటామన్నారు. అదే విధంగా జిల్లాలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించేందుకు ఆర్మీ కల్నాల్ పర్యటించారని తెలిపారు. జిల్లా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. సమావేశంలో ఆర్డీవో రాజేశ్వర్, సైనిక సంక్షేమ అధికారి, డీవైఎస్వో వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్, మున్సిపల్ ఈఈ వెంకటశేషయ్య, తదితరులు పాల్గొన్నారు.