బోథ్/సిరికొండ/నిర్మల్అర్బన్/పెంబి, దస్తురాబాద్, ఏప్రిల్ 23: రాష్ట్రం ప్రభుత్వం ఈ నెల 24 నుంచి జూన్ 12 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు శనివారం ఇంటిబాట పట్టారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షలు ముగియగా వారికి ప్రగతిపత్రాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందజేశారు. మరోవైపు వేసవి సెలవులు మొదలుకావడంతో విద్యార్థులు హద్దులేని ఆనందంలో మునిగిపోయారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని వసతి గృహాలు, కస్తూర్బాగాంధీ, ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులను తల్లిదండ్రులు, బంధువులు వచ్చి తీసుకెళ్లారు.