మంచిర్యాల, ఏప్రిల్ 23, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ విప్ సుమన్ కృషితో చెన్నూర్ నియోజకవర్గ రైతుల చిరకాల స్వప్నం దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. రూ.1,658 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలోని 90 వేల ఎకరాలకు పైగా సాగు నీరందించే ‘చెన్నూర్ ఎత్తిపోతల’ పథకానికి పాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయి. తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీల నీటిని అందించే ‘కేసీఆర్ గిఫ్ట్.. చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్’కు అనుమతులిస్తూ ప్రభుత్వం జీవో 133 విడుదల చేసింది. నియోజకవర్గ రైతులు, ప్రజల తరఫున ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కృతజ్ఞతలు తెలిపారు.
చెన్నూర్ ఎత్తిపోతల పథకంలోని లిఫ్ట్-1లో భాగంగా పార్వతీ బ్యారేజ్ నుంచి జైపూర్ మండలంలోని 21 గ్రామాలు, మందమర్రి మండలంలోని 6 గ్రామాలు కలిపి మొత్తంగా 27 గ్రామాల పరిధిలోని 25,422 ఎకరాలకు సాగు నీరు అందనుంది. లిఫ్ట్-2లో భాగంగా సరస్వతీ బ్యారేజ్ నుంచి చెన్నూర్ మండలం సోమన్ పల్లి వద్ద నిర్మించే పంప్ హౌస్ నుంచి చెన్నూర్ మండలంలోని 30 గ్రామాలు, భీమారం మండలంలోని 13 గ్రామాలు, కోటపల్లి మండలంలోని 9 గ్రామాలు కలిపి మొత్తంగా 52 గ్రామాల్లోని 48, 208 ఎకరాలకు సాగు నీరు అందనుంది.
లిఫ్ట్-3లో భాగంగా లక్ష్మీ బ్యారేజ్ నుంచి కోటపల్లి మండలం ఆల్గాం వద్ద నిర్మించనున్న పంప్‌హౌస్ ద్వారా కోటపల్లి మండలంలోని 24 గ్రామాల్లోని 16, 370 ఎకరాలకు సాగు నీరందనుంది. మొత్తంగా రూ.1658 కోట్లతో నిర్మించే చెన్నూర్ ఎత్తిపోతల పథకం ద్వారా 74,270 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 15,730 ఆయకట్టు స్థిరీకరించబడి మొత్తంగా చెన్నూర్ నియోజకవర్గంలోని 103 గ్రామాల్లో 90 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించినట్లు ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి పాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ జీవో నంబర్ 133 విడుదల చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రభుత్వ విప్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.