ఆసిఫాబాద్, ఏప్రిల్ 23 : కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఫొటోను అపరిచితుడు వాట్సాప్ డీపీలో పెట్టుకొని మోసానికి యత్నించాడు. డబ్బులు పంపాలని ఇతర అధికారులకు మెస్సేజ్ పంపాడు. దీన్ని గమనించిన అధికారులు అప్రమత్తమయ్యారు. 97251 99485 నంబర్‌కు ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్‌రాజ్ డీపీ పెట్టిన నేరగాడు.. జిల్లా అధికారులకు పలు సందేశాలు పంపాడు.
తాను అత్యవసర సమావేశంలో ఉన్నానని, డబ్బులు పంపించాలని చాట్ చేశాడు. ఈ క్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రవికృష్ణ ‘మీరు ఎక్కడున్నారు’ అని రీ చాట్ చేశారు. అక్కడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఇది సైబర్ నేరగాళ్ల పనేనని అధికారులు అప్రమత్తమయ్యారు. ఎవరూ డబ్బులు పంపించలేదు. శుక్రవారం సైతం ఆదిలాబాద్ కలెక్టర్ పేరును సైబర్ నేరగాళ్లు వినియోగించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఈ విషయాన్ని పోలీస్‌శాఖ సీరియస్‌గా తీసుకుంది. తన పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే స్పందించవద్దని కలెక్టర్ రాహుల్‌రాజ్ కోరారు. మోసపూరిత సందేశాలను ఎవరూ నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఇప్పటికే సైబర్ నేరగాళ్లపై నిఘా ఉంచామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.