ఇచ్చోడ, ఏప్రిల్ 22 : గ్రామాల్లో వలసలను అరికట్టడంతో పాటు కూలీలకు చేతినిండా పనులు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జా తీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నాయి. పనులు చేసే కూలీలకు పూర్తిస్థాయి లో న్యాయం చేసేందుకు పారదర్శకతకు శ్రీకారం చుట్టింది. కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన ఆన్లైన్ హాజరు (ఎన్ఎంఎంఎస్) విధానంతో అవినీతి, అక్రమాలు చోటు చేసుకోకుండా ఉంటాయి. పనులకు వచ్చిన వారి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టడంతో అక్రమాలకు చెక్ పడనుంది.
ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా లక్ష 74 వేల 28 వేల జాబ్‌కార్డులు ఉండగా లక్ష 15 వేల 983 మంది కూలీలు ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. 9108 శ్రమశక్తి సంఘాలు ఉన్నాయి. ప్రస్తుతం పంట కాల్వలు శుభ్రం చేయడం, చెరువుల్లో పూడికతీత తొలగించడం, రాళ్లు ఏరడం, హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ, వ్యవసాయ క్షేత్రాలను చదును చేయడం, అటవీ ప్రాం తాల్లో ట్రెంచ్‌ల ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన వా రి వివరాలు గతంలో మస్టర్లలో వారి సంతకాలు తీసుకొని నమోదు చేసే వారు. రాని వారి పేర్లు సైతం అందులో పొందుపర్చడం వంటివి కొన్ని చోట్ల చేయడంతో పనులు చేసిన అసలు కూలీలకు అన్యాయం జరిగేది. ఇలాంటి అక్రమాలు తనిఖీల్లో బయటపడుతుండడంతో దానికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంది.
ఉపాధి పనుల్లో పూర్తి పారదర్శకత కోసం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం (ఎన్ఎంఎంఎస్) యాప్‌ను గతేడాది మే 21న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వం అమలుకు శ్రీకారం చు ట్టింది. ఇందుకోసం ఆయా గ్రామాల్లో పది మంది కి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి వారి వివరాలు ఆన్లైన్లోని మస్టర్లలో ఇప్పటికే పొందుపర్చారు. వచ్చిన కూలీల పేర్లు చదివి హాజరైంది, గైర్హాజరైంది ఎవరన్న వివరాలు వారి ఎదుట చెప్పడం, వారు పనులు చేస్తున్న ఫొటో తీసి అందులో నిక్షిప్తం చేయనున్నారు. ఈ విధానంతో ఏ ప్రాం తంలో పని చేస్తున్నారన్న విషయాలు జియోట్యాగింగ్ రూపంలో తెలియనుంది. వీటి నిర్వహణకు గ్రామానికి ఒక మెట్ చొప్పున జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నియమించారు.
ఎన్ఎంఎంఎస్ విధానంతో కూలీలకు చాలా మేలు జరుగుతుంది. పనులకు వచ్చిన వారి పూర్తి వివరాలు తెలియడంతో పాటు ఏ ప్రాంతంలో చేస్తున్నారో జియో ట్యాగింగ్ ద్వారా వెల్లడవుతుంది. పూర్తి స్థాయిలో పారదర్శకత జరుగనుంది. అక్రమాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడనుంది. జాబ్ కార్డులు కలిగిన ఉన్న వారికి ఉపాధి పనులు కల్పిస్తున్నాం.
-వామనభట్ల రాంప్రసాద్, ఎంపీడీవో, ఇచ్చోడ
